
ప్రజాశక్తి-అనకాపల్లి
గ్రామాలలో సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మండలంలోని బవులవాడ పంచాయతీ దర్జీనగర్ గ్రామంలో మంగళవారం ఎంపీపీ గొర్లి సూరిబాబు నేతృత్వంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీశారు. మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేదని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకరాగా, వెంటనే ఆయన కాలువల నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేసినట్టు ప్రకటించారు. అనంతరం దర్జీనగర్‌లో రూ.19 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్లను, బవులవాడలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ కాలువలు, రోడ్లను, రూ.10లక్షలతో నిర్మించిన ఇంటింటి కుళాయిలకు అవసరమైన పైప్‌లైన్లను, రావుగోపాలరావు కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. పార్టీ కార్యకర్త నక్కిన సోమేశ్వరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని మంత్రి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మజ్జి లక్ష్మి, వైసిపి గ్రామ అధ్యక్షులు మజ్జి వెంకట అప్పారావు, ఏఎంసీ సభ్యుడు దాడి కుమార్, వైసిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.