Jul 08,2023 00:08

గ్రామాల్లో సమస్యల పరిష్కారం ఏదీ?


ప్రజాశక్తి-రోలుగుంట:ఎంపిపి యర్రంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో స్వపక్షనేతలైన వైసిపి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు అధికారులను నిలదీశారు. జలకళ నిధులతో రైతులకు పొలల్లో బోరుబావులు వేశారని,. కరెంట్‌ లైన్లు వేయలేదని, కుసర్లపూడి జగనన్న కాలనీలో రోడ్డు, రహదారి, కరెంట్‌ కల్పించలేదని ఎవరితో చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్థితులు ఏర్పడ్డాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరేళ్లుగా అంగన్వాడీ భవనం బిల్డింగ్‌ బిల్లులు అందలేదని, ఆయా పనులను వైసిపి నేతలే కాంట్రాక్టు చేశారని విషయాన్ని అధికారులు పిఆర్‌ ఎఇ ఉమామహేశ్వరావు ప్రభుత్వానికి పెద్దలకు విన్నవించాలని కోరారు. స్థానిక నాయకులతో పాత పనులు చేయించుకోవడమే తప్పా సరైన ప్రాధాన్యత కల్పించడంలో వారికి కేటాయించిన నిధులు కాంట్రాక్టర్‌ చేసిన బిల్లులు ఇవ్వడంలో ప్రభుత్వం వెనుకబడిందన్నారు. ఈ సమావేశంలో కంచుగుమ్మల సర్పంచ్‌ బండారు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతీ సమావేశంలో తమ సమస్యను విన్నవించుకోవడమే కానీ న్యాయం జరగ లేదన్నారు. మా గ్రామ పరిధిలో సుమారు 60 ఎకరాల భూమిని ఎండోమెంట్‌ భూమిగా ఆన్‌లైన్‌ నమోదు కాబడిందని, వాస్తవానికి 12 ఎకరాల 80 సెంట్లు మాత్రమే ఎండోమెంట్‌ భూమి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికీ పలుమార్లు విన్న వించడం జరిగిందన్నారు. దీనిపై తహశీల్దార్‌ వరహాలు స్పందించి డిప్యూటి కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళతానన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి అధ్యక్షులు, కుసర్లపూడి సర్పంచ్‌ మడ్డు అప్పలనాయుడు, జెడ్పీటీసీ పోతల రమణమ్మ, ఎంపిటిసి రామ్‌, సర్పంచ్‌లు పోతల రాజశేఖర్‌, ఉలబాల రాము, గుములూరు బాబులు, హౌసింగ్‌ ఎఇ , ఎంఇఒ జగ్గారావు, ఏపిఒ సూర్యమణి, వైద్యాధికారి రాజ్యలక్ష్మీ, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.