Oct 24,2023 20:25

బాధితుడి వేలును గాయపరిచిన పిచ్చికుక్క

అట్లూరు : మండలంలోని పలు గ్రామాలల్లో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఒకే రోజు ఏడుగురిపై దాడి చేసింది. మంగళవారం ఉదయం నుంచి స్వైర విహారం చేసి ఏడుగురిని తీవ్రంగా గాయపరిచింది. చివరికి కమలకూరులో స్థానికులు పిచ్చికుక్కను చంపేశారు. మణ్యంవారిపల్లె, కమలకూరు పంచాయతీలోని పలు గ్రామాలల్లో దారివెంట వెళ్తున్న వారిపై పిచ్చికుక్క దాడిచేసింది. కమలకూరుకు చెందిన వెంకటసుబ్బయ్యను చేతివేలిని తినేసింది, కాటంవారిపల్లె గంగయ్య, మన్యంవారిపల్లెకు చెందిన చిన్నపరెడ్డిపై పొట్టపై దాడిచేసి గాయపరిచింది. అదేగ్రామాలకు చెందిన వంశి వర్ధన్‌ రెడ్డిని చేతివేలిని తీవ్రంగా కొరికేయడంతో రక్తం స్రావమైంది. పార్వతిపురంలో ఇంటి బయట ఆడుకుంటున్న నిహారికపై పిచ్చికుక్క తలపై దాడి చేసింది. సుబ్రమణ్యం, శుభచంద్రారెడ్డిపై తొడపై తీవ్రంగా గాయపరిచింది. వీరు చికిత్స నిమిత్తం వెంటనే బద్వేలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు.