Jun 04,2023 23:59

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపర్చేందుకు విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం సమర్ధవంతంగా అమలు చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు తెలిపారు. ప్రతి మండలంలో రెండు పిహెచ్‌సిలు ఉన్నాయని, వీటిల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనే వైద్యసేవలు ప్రజలకు మెరుగ్గా అందిస్తున్నామన్నారు. ప్రజాశక్తి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు తెలియజేశారు.
పిహెచ్‌సిలు ఎన్ని ఉన్నాయి? వాటిల్లో ఏయే సేవలు అందిస్తున్నారు?
జిల్లాలో 22 పిహెచ్‌సిలున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒపి చూస్తున్నారు. పిహెచ్‌సిలో ఒక డాక్టర్‌ ఉంటారు. మరొకరు 104 వాహనంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో చికిత్సలు అందిస్తారు. సాయంత్రం నుంచి తెల్లవారి వరకు ఇద్దరు స్టాఫ్‌ నర్సులు ఉంటారు. ఒక్కో పిహెచ్‌సిలో మొత్తం 14 మంది సిబ్బంది ఉంటారు.
ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు ఎలా ఉంది?
గ్రామాల్లో ప్రతి కుటుంబాన్ని పర్యవేక్షిస్తూ ఆరోగ్య సూత్రాలు పాటించేలా సలహాలు, సూచనలు ఇస్తూ ఒక వైద్యుడు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తారు. 104 వాహనంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి కుటుంబంలో అనార్యోగం బారిన పడిన వారిని గుర్తించి వారికి చికిత్సలు అందిస్తారు. ఒక్కొ గ్రామానికి రెండుసార్లు ఫ్యామిలీ డాక్టర్‌లా వెళతారు. వైద్య బృందం ఆయా గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉంటారు. జనరల్‌ ఒపి, వైరల్‌ వ్యాధులు, హైపర్‌టెన్షన్‌, బిపి, షుగర్‌, గర్భిణులకు ప్రసవానికి ముందు సేవలు, బాలింతలకు ప్రసవానంతర సేవలు, శిశు సంరక్షణా, చిన్నారులకు వైద్య పరీక్షలు, రక్తహీనత కేసులను చూస్తారు. తరువాత పాఠశాలల్లో విద్యార్థులను, అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులను పరిశీలిస్తారు. దీర్ఘకాలిక సమస్యలతో మంచంలో ఉన్న రోగులను ప్రత్యేకంగా గుర్తించి వారిని స్వయంగా పలకరించి వారికి చికిత్సలు అందిస్తారు. రక్తహీనత కలిగిన చిన్నారులను గుర్తించి వారికి మందులు ఇస్తారు. ఫ్యామిలీ డాక్టర్‌ పేరు, ఫోను నెంబరు, సిబ్బంది వివరాలను ఆయా గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి ప్రజలకు వారితో సన్నిహిత సంబంధాలు ఉండేలా చూస్తున్నాం.
అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఎలా పనిచేస్తున్నాయి?
పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలందించేందుకు అర్బన్‌ హెల్త్‌సెంటర్లు ప్రారంభించారు. మొత్తం 50 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు వైద్యులు చికిత్సలు అందిస్తారు. పారామెడికల్‌ సిబ్బంది, పరిపాలన సిబ్బంది కూడా ఉంటారు. ప్రాథమిక చికిత్సలన్నీ చేస్తారు.
విలేజి క్లినిక్‌లుపని తీరు ఎలాఉంది?
జిల్లాలో 211 విలేజ్‌ క్లినిక్‌లు అందుబాటులోకి వచ్చాయి. బిఎస్‌సి నర్సింగ్‌ చేసినవారు, వైద్య చికిత్సలు చేసిన సిబ్బంది విలేజ్‌ క్లినిక్‌లలో అందుబాటులో ఉంటారు. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు అందుబాటులో ఉంటారు. వీరు మహిళలకు తగిన చికిత్సలు చేస్తారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీలు, రోజువారి ఒపిలు, బుధవారం, శనివారం ఇమ్యూనైజేషన్‌, వాక్సిన్‌లు ఎప్పటికప్పుడు ఇస్తారు. 211 క్లినిక్‌లకు గాను 160 వరకు శాశ్వత భవనాలున్నాయి. 50 చోట్ల భవనాల నిర్మాణం జరుగుతోంది.