ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి గ్రామాల్లో పల్లెవెలుగులు కానరావట్లేదు. పల్లెల్లో ప్రయాణికులకు ఆర్‌టిసి సేవలు అరకొరగానే అందుతున్నాయి. కరోనా తర్వాత నుంచి పలు గ్రామీణ సర్వీసులు నిలిచిపోయినా నేటికీ తిరిగి ప్రారంభం కాలేదు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి చేతిచమురు వదిలించుకుంటున్నారు. ఉచిత, రాయితీ బస్ పాసులకు అవకాశం ఉన్నా అక్కరకు రావడం లేదు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11 ఆర్‌టిసి డిపోల పరిధిలో 44 బస్టాండ్లు ఉన్నాయి. 350 రూట్లలో 840 ఆర్‌టిసి బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్టాండ్ల నుంచి ప్రతి రోజూ సుమారు 5.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పండగ వేళల్లో ఈ సంఖ్య 8 లక్షల వరకూ ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలతో పాటూ వేలాది మంది స్కూల్, కళాశాల విద్యార్థులు, వందలాది మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఆర్‌టిసి సర్వీసుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఒకప్పుడు ఆర్‌టిసి బస్సులు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తిరిగేవి. దీంతో ఇతర వాహనాలపై ఆధార పడాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రమాదాలు కూడా చాలా తక్కువ. ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం అయిన తర్వాత సేవలు కుంటుపడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ కారణాలతో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక ప్రయివేటు, సొంత వాహనాలపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.
తప్పని కష్టాలు
ఏదైనా పనిపై పొరుగూళ్లకు వెళ్లాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలు నానా యాతన పడుతున్నారు. ప్రయివేటు వాహనాల్లో అధిక చార్జీలను భరించలేక జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కాకినాడ నుంచి యు.కొత్తపల్లి వరకూ బీచ్ రోడ్డు మీదుగా 2007 వరకూ బస్సులు నడిచేవి. దాంతో సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు ఉండేవి కావు. ఆయితే ఈ సర్వీసులను నిలిపివేయడంతో సమస్యలు తప్పడం లేదు. కాకినాడ నుంచి వయా పిఠాపురం మీదుగా యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురానికి ఇటీవల బస్సు సర్వీసును పునరుద్దరించారు. అయితే ఒకే బస్సును తిప్పడంతో పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందట్లేదు. కాకినాడ నుంచి సూరంపాలెంలోని ఇంజినీరింగ్ కళాశాలలకు వేలాది మంది విద్యార్థులు చదువుల కోసం వెళుతున్నారు. కాని ఈ రూట్‌లో సరిపడా సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ నుంచి కోరంగికి, గొల్లల మామిడాడ వరకు నూతన బస్సు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాకినాడ తుని మధ్య సర్వీసులున్నా, ఉదయం సమయంలో తీవ్ర రద్దీ కొనసాగుతోంది. విద్యార్థులు వేలాడుతూ ప్రమాదపు అంచున ప్రయాణాలు చేస్తున్నారు. కాకినాడ నుంచి ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి బస్సు సర్వీసును నిలిపేయడంతో జేబులు గుల్ల అవుతున్నాయని పలువురు వాపోతున్నారు. కత్తిపూడి నుంచి వజ్రకూటం, తుని నుంచి తిమ్మాపురం మధ్య సర్వీసులు కావాలని ప్రజలు కోరుతున్నా ఆర్‌టిసి అధికారులు పట్టించుకోవట్లేదు. అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక చాలా మంది విద్యార్థులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. తుని నుంచి కెఒ.మల్లవరం వెళ్లాలంటే రహదారులున్నా ఆర్‌టిసి సర్వీసులు లేవు. తొండంగి మండలం వంటిమామిడి, దానవాయిపేట పరిసర ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేదు. గతంలో తుని నుంచి తిమ్మాపురం మీదుగా శృంగవక్షం వరకూ నడిచే బస్సును ఇప్పుడు నిలిపేశారు. అలాగే శంఖవరం మండలం కత్తిపూడి నుంచి వజ్రకూటం నడిచిన బస్సు కరోనా తర్వాత నుంచి ప్రారంభం కాలేదు. పెదపూడి మండలం గొల్లల మామిడాల నుంచి కాకినాడకు నిత్యం వేలాది మంది ప్రజలు వందల సంఖ్యలో విద్యార్థులు వివిధ అవసరాల కోసం వస్తుంటారు. ఈ రూట్లో బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.ఉమ్మడి జిల్లాల్లో అతిపెద్ద ఆసుపత్రి అయిన జీజీహెచ్ కు పూర్తిస్థాయిలో బస్సులు లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. జగ్గంపేట మండలం గుర్రంపాలెం, గొల్లల గంట, కాండ్రేగుల, బావవరం, నెరేటి పట్నం, మామిడాడ, ఇర్రిపాక, మర్రిపాక గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల్లో సుమారు 30వేల మంది జనాభా వుంటారు. కాజులూరు మండలంలో మూడు గ్రామాలకు తప్ప సుమారు 15 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. గతంలో మంజేరు - కాకినాడ, దుగ్గుదుర్రు - కాకినాడ, నామవారిపాలెం కాకినాడ, మతుకుమిల్లి - కాకినాడ, అండ్రంగి - కాకినాడ,తణుకువాడ -కాకినాడ బస్సులను నడిపేవారు. అయితే రద్దీ లేదనే నేపంతో ఆ బస్సు సర్వీసులను రద్దు చేశారు.
బస్సుల్లేక ఇబ్బంది పడుతున్నాము
కరప మండలం వేములవాడ నుంచి రోజూ కాకినాడ కళాశాలకు వస్తున్నాను. సరిపడా బస్సులు లేక తిభ్ర ఇబ్బందులు పడుతున్నాము. అధికారులు స్పందించి బస్సు ఏర్పాటు చేస్తే అనేకమంది విద్యార్థులకు మేలు చేసిన వారవుతారు.
- సంజరు, డిగ్రీ రెండోవ సంవత్సరం










