Apr 25,2023 19:22

జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ప్రశాంతంగా ఉన్న పల్లె వాతావరణంలో క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా చిచ్చు రేపుతోంది. చిన్నా, చితకా మ్యాచ్‌లకు తోడు ఐపిఎల్‌, దేశవాళీ క్రికెట్‌ టోర్నీ, ప్రపంచంలో ఏ ఒక్క క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినా దానిపై ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తుండడం విశేషం. క్రికెట్‌కు జెంటిల్‌మెన్‌ ఆటగా పేరుంది. అంతటి గౌరవప్రదమైన క్రీడను బెట్టింగ్‌ రాయుళ్లు సొమ్ముగా మలచుకుంటున్నారు. కొద్దిపాటి సొమ్ముతో లాభాలు వస్తాయనే ఆశతో.. యువత క్రికెట్‌ బుకీల చేతుల్లో చిక్కి బలవుతున్నారు. ప్రస్తుతం అంతటా ఐపిఎల్‌ ఫీవర్‌ పట్టుకుంది. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన క్రికెట్‌ జూదం ఇప్పుడు పల్లెలకూ పాకింది. ఈ జూద క్రీడలు మధ్య తరగతి కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. క్రికెట్‌ బెట్టింగ్‌ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఈ మాఫియా ఊబిలో దిగి సర్వస్వాన్ని కోల్పోయి తల్లిదండ్రులకు భారం అవుతున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ ప్రతి బంతికి, ప్రతి పరుగుకు బెట్టింగ్‌ నిర్వహిస్తూ భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకుంటున్నారు. బెట్టింగ్‌ మోజులో పడి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి యువత చివరకు రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తోంది. పోలీసు వ్యవస్థ ద్వారా పెద్ద స్థాయిలో నిఘా ఉన్నా వారికి చిక్కకుండా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. పలు వెబ్‌ సైట్ల ద్వారా సీక్రెట్‌గా బెట్టింగ్‌ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రతి మండల కేంద్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా మొబైల్‌ ఫోన్ల ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ఐపిఎల్‌ సీజన్‌లో గ్రామీణ యువత చేతుల్లో రూ.లక్షలు మారినట్లు సమాచారం. బెట్టింగ్‌కు పాల్పడి నష్టపోవడంతో కుటుంబ సభ్యులకు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో అప్పుల పాలై గ్రామాలను విడిచి వలస వెళ్లే పరిస్థితి దాపురిస్తోంది. దీనికి తోడు తల్లిదండ్రులను వేధిస్తూ అందినకాడికి తీసుకెళ్తూ ఈ బెట్టింగ్‌ మాఫియాకు బలవుతున్నారు.
బానిసలవుతున్న యువత
యువతకు బెట్టింగ్‌ వ్యసనంగా మారింది. చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటే చాలు బెట్టింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంట్లో కూర్చొనే ఆడుకుంటున్నారు. మనీ వాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోకి బ్యాంకు ఖాతా, ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేసుకుంటున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల్లో రిజిస్ట్రేషన్‌ అయిన ప్రధాన బుకీలు.. వాటిని సబ్‌ బుకీలు, ఏజెంట్లకు అప్పగించి తెర వెనుక నుంచి వ్యవహారం నడిపిస్తున్నారు. ప్రయివేట్‌ ఉద్యోగులు, చిన్నపాటి వ్యాపారులు, విద్యార్థులు సరదాగా పందేలు కాస్తూ బానిసలవుతున్నారు. బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లు అందుబాటులోకి రావడంతో ప్రధాన బుకీలు, ఫంటర్లు ఎవరనేది గుర్తించడం సవాలుగా మారింది. ఇదే అదనుగా యాప్‌లో రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించిన బుకీలు వాటిని ఇతరులకు అప్పగించి తెరవెనుక నుంచి వ్యవహారం నడిపిస్తున్నారు.
పట్టణం నుంచి పల్లెల్లోకి
ఐపిఎల్‌ ప్రారంభమైందంటే చాలు ఆదోని పట్టణంతోపాటు పెద్దతుంబలం, పెద్దహరివాణం, మండగిరి గ్రామాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ భూతం పడగవిప్పుతుంది. ప్రధానంగా పట్టణాల్లో లాడ్జిలలో, గ్రామాల్లో ఊరి చివర ఉన్న పొలాల్లో తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ జరుగుతోంది. క్రికెట్‌ మ్యాచ్‌ ప్రారంభం నుంచి యాప్‌లో లైవ్‌ చూస్తూ పందేలు కాయిస్తున్నారు. సిక్సర్లు, బౌండరీలు, వికెట్లు, మ్యాచ్‌ గెలుపోటములు ప్రతి అంశంపై పోటీ పడుతూ మరీ పందేలు కాస్తుండడం విశేషం. సంబంధిత అధికారులు స్పందించి బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వారిపై నిఘా వేస్తే వీరి గుట్టు బయటపడే అవకాశముంది.