Dec 15,2022 00:15

వృద్ధునితో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం బూడి

ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని కొరువాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మండలస్థాయి అధికారులతో కలిసి చేపట్టారు. గ్రామంలో ప్రతి వీధికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 336 కుళాయిలు ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. మరో 20వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ట్యాంక్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆ గ్రామంలో రూ.13.50 లక్షలతో నాడు-నేడు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాండ్రేగుల శశిదేవి, తహశీల్దారు రమేష్‌బాబు, జెడ్‌పిటిసి అనురాధ, ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌, స్థానిక ఎంపిటిసి చీపురపల్లి అచ్చిబాబు, మండల శాఖ అధికారులు వైసిపి నాయకులు పాల్గొన్నారు.
చోడవరం : మండలంలోని రాయపురాజుపేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో శ్యామసుందర్‌, మాజీ జెడ్పిటిసి బి సూర్యనారాయణ, వైసిపి నాయకులు పి నర్సింగరావు, అధికారులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : మండలంలోని దోసూరు పంచాయతీ పరిధి కొల్లివానిపాలెం, గొల్లల పాలెం , గండివానిపాలెం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ నెంబర్‌ నర్మల కుమార్‌, డిసిసిబి మాజీ చైర్మన్‌ యు.సుకుమార్‌ వర్మ, వైసిపి నాయకులు దేశంశెట్టి శంకర్రావు, కోన బుజ్జి, కె.విమలా నాయుడు, పంచదారల పైడిరాజు పాల్గొన్నారు.