
మంత్రి కొట్టు సత్యనారాయణ
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
పట్టాల మంజూరుకు అవసరమైన గ్రామాల్లో భూసేకరణ పనులను వెంటనే చేపట్టాలని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి నియోజవర్గస్థాయి సమీక్షా సమావేశం జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గృహ నిర్మాణాలు త్వరగా చేపట్టాలన్నారు. కోర్టు ఇబ్బందులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. మెట్ట ఉప్పరగూడెం ఎస్‌టి కాలనీ వాసులకు, కొండేపాడు ఎస్‌సి కాలనీ వాసులకు నూతన ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. అలాగే నూతనంగా ఇంటి స్థలాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 90 రోజుల కాలవ్యవధిలో పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇంటి స్థలాలు మంజూరు చేసిన లబ్ధిదారులకు పొజిషన్ చూపాలన్నారు. టిడ్కో గృహాల పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో అందజేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం సమీక్షా సమావేశాలు నిర్వహించి వివిధ శాఖల పరిధిలో ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకోవడం ద్వారా అభివృద్ధి పనులు సులువవుతాయన్నారు. తమ పరిధి దాటినవి జిల్లా దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కరించడంతో అభివృద్ధికి అంటకం లేకుండా ఉంటుందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే మంచి ఫలితాలు సాధించగలమన్నారు. ప్రాధాన్యతా భవనాలు, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీరాజ్, జలవనరులు, గృహ నిర్మాణం, పంచాయతీ రాజ్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జలవనరులు, రహదారులు భవనాలు, విద్యుత్, రెవిన్యూ సాంఘిక సంక్షేమం, ఐసిడిఎస్ పశు సంవర్ధక శాఖలపై రహదారులు, భవనాల, పట్టణ ప్రణాళికా, విద్యుత్, రెవెన్యూ గ్రామీణ నీటిపారుదల శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులపై ఆమె ఆరా తీశారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల సొంత స్థలాల్లో నిర్మించుకున్న 1,022 గృహాలు, 90 రోజులు ప్రోగ్రామ్ నందు ఇచ్చిన 246 పట్టాలు మొత్తం 1,268 గృహాల మంజూరుకు ప్రతిపాదించారు. తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు మండలాల్లో జగనన్న లేఅఔట్ వద్ద అంతర్గత రోడ్లు, మరమ్మతు పనులు మంజూరు చేయడం గురించి, పెంటపాడు మండలం కోరుమిల్లిలో నూతనంగా పట్టాలు ఇచ్చిన జగనన్న లేఅవుట్‌లో స్థలం మెరకు చేయడం తదితర పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్‌డిఒ దాసి రాజు, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, సిపిఒ కె.శ్రీనివాసరావు, డిఎస్‌పి, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎ.శామ్యూల్, జిల్లా వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు కైగాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.