
ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. దాదాపు నెల రోజులుగా కురవని వర్షం బుధవారం కురియడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా వేసవిని తలపించిన ఎండ వేడిమికి అల్లాడిన ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. ప్రస్తుతం కురిసిన వర్షంతో వరి పంటకు ఎంతో మేలు జరుగుతుందని, అదేవిధంగా కొన్నిచోట్ల నాట్లు వేసుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులు తెలిపారు.ఆరు పంటలకు కూడా ఈ వర్షం ఉపకరిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి మండల కేంద్రంలో రహదారులు జలమయమయ్యాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై నీరు నిలిచి పోయింది.
బుచ్చయ్యపేట : అల్పపీడనం ప్రభావంతో బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దిబిడి, బుచ్చయ్యపేట, కందిపూడి, పోలేపల్లి, రాజాం, సీతయ్యపేట, తురకలపూడి, గుణెంపూడి, పెదపూడి, కొండపాలెం, కేపీ అగ్రహారం, గ్రామాల్లో భారీ వర్షానికి పొలాలు నీటిమునిగాయి. కొంతకాలంగా నీరు లేక వరి నాట్లు అడపాదపగానే సాగుతున్నాయి.
దేవరాపల్లి : దేవరాపల్లి పరిసర ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసింది. రెండు గంటల సమయంలో ఒకేసారి వాతావరణం మారి ఉరుములు మెరుపులతో సుమారు గంటసేపు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.