ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్, చిత్తూరు: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పంచాయతీరాజ్ శాఖ కీలకమని జడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశపు మందిరం వైఎస్‌ఆర్ సభావేదికలో జిల్లాలోని విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జెడ్పి సీఈవో మాట్లాడుతూ గ్రామాల సర్వతో ముఖాభివద్ధికి కషిచేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను సులభతరం చేయడం జరిగిందని, ప్రజల ఇంటి ముంగిటికే ప్రభుత్వసేవలు అందుతున్నాయని అన్నారు. ఈ సచివాలయ వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అధికంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పని చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీ రాజ్‌శాఖ కేటాయించిన విధులను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మండలస్థాయిలో కూడా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందితో గ్రామ పంచాయతీలలో సమావేశాలు నిర్వహించడం, ఆదాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామ పంచాయతీలో చేయవలసిన పనులు, నిర్వహించాల్సిన రికార్డులు, గ్రామపంచాయతీలో తనిఖీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల విధులు బాధ్యతలు తదితర అంశాలపై శిక్షణాకార్యక్రమంలో వివరించారు. కార్యక్రమంలో డిపిఆర్‌సి కోఆర్డినేటర్ షణ్ముగం, డిఎల్‌పిఓలు నగరి, పలమనేరు, కుప్పం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.