
డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు
కుముదవల్లిలో రూ.67 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రజాశక్తి - పాలకోడేరు
కుముదవల్లి గ్రామాభివృద్ధికి గ్రామ సర్పంచి, సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షులు భూపతి రాజు వంశీకృష్ణమరాజు అందిస్తున్న సేవలు అమోఘమని డిసిసిబి ఛైర్మన్, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్.నరసింహరాజు అన్నారు. కుముదవల్లి బివి.రాజు కాలనీలో ఇటీవల రూ.10 లక్షలతో నిర్మించిన డ్రెయినేజీని సర్పంచి వంశీకృష్ణంరాజు, భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటిరాజు)లతో కలిసి శనివారం ప్రారంభించారు. గ్రామస్తులకు సురక్షితమైన నీటిని అందించేందుకు జల జీవన్ మిషన్ పథకంలో రూ.40 లక్షలతో ఒహెచ్‌ఆర్ ట్యాంకు, పైపులైన్ నిర్మాణానికి, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంజూరైన రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు, చెరువు చుట్టూ రూ.7 లక్షలతో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పివిఎల్ మాట్లాడుతూ సర్పంచి వంశీకృష్ణమరాజు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అభినందనీయమన్నారు. గ్రామస్తులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి వంశీకృష్ణమరాజు కషి చేస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ప్రజలకు సమానంగా అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పార్టీకి అండగా ఉండాలని కోరారు. అనంతరం బివి.రాజు కాలనీవాసులు పివిఎల్‌ను, వంశీకృష్ణమరాజును, ఎంపిపి చంటిరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎఎంసి ఛైర్మన్ వెంకటేశ్వరరావు, వైస్ ఛైర్మన్ చేకూరి రాజా నరేంద్ర వర్మ, వైసిపి ముఖ్య నేతలు పెనుమత్స శ్రీనివాస్‌రాజు, భూపతిరాజు రమేష్‌రాజు, అంగర సత్తిబాబు, దుండి అశోక్‌బాబు, వైసిపి గ్రామ నాయకులు ముసలయ్య, సూరిబాబు, రామ్మూర్తి, సత్యమ్ పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో వైసిపి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని డిసిసిబి ఛైర్మన్, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్.నరసింహరాజు అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సర్పంచి వంశీకృష్ణమరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పివిఎల్ ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ, అంగన్‌వాడీలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పివిఎల్, ఎంపిపి చంటిరాజు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు సర్పంచి వంశీకృష్ణమరాజు అధ్యక్షత వహించగా పివిఎల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బొల్ల శ్రీనివాస్, జంగం సూరిబాబు, గొట్టుముక్కల వెంకట శివరామరాజు (శివాజీ రాజు), యూత్ విభాగం మండల అధ్యక్షులు పెనుమత్స వెంకటరాజు (బాబు), నాయకులు పాల రాధాకృష్ణ, హనుమంతరావు, వెంకటరాజు, బి.రాంబాబు, ఎంపిడిఒ మురళీగంగాధరరావు, పంచాయతీ కార్యదర్శి కానూరి రాజేష్, ఆర్‌ఐ నాగభూషణరావు పాల్గొన్నారు.
సహకారం మరువలేను : సర్పంచి వంశీష్ణంరాజు
గ్రామాభివృద్ధికి డిసిసిబి ఛైర్మన్, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్.నరసింహరాజు, ఎంపిపి చంటిరాజు, అధికారులు, గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందిస్తున్న సహకారం మరువలేనని కుముదవల్లి సర్పంచి భూపతిరాజు వంశీకృష్ణమరాజు అన్నారు. గ్రామాభివృద్ధికి పివిఎల్ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పివిఎల్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ఉండిలో పివిఎల్‌ను ఎంఎల్‌ఎగా గెలిపించేందుకు అంత కృషి చేయాలన్నారు.