Nov 14,2023 20:47

జెడ్‌పిటిసి లక్ష్మీ తులసి, సర్పంచి లక్ష్మి విమర్శ
ప్రజాశక్తి - పాలకోడేరు
గ్రామాభివృద్ధికి అధికారులు అడ్డంకిగా మారారని పాలకోడేరు జెడ్‌పిటిసి పెద్దిశెట్టి లక్ష్మీతులసి, గొల్లలకోడేరు గ్రామ సర్పంచి కుక్కల లక్ష్మి ఆరోపించారు. గొల్లలకోడేరు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో 7, 8 వార్డుల్లో రూ.16 లక్షలతో సీసీ రోడ్ల ఏర్పాటు, 11వ వార్డులో మరో రూ.16 లక్షలతో సీసీ రోడ్లు, 2వ వార్డులో రూ.4 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రామ పంచాయతీ సాధారణ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. చిన్నపాటి వర్షానికి రోడ్లు మొత్తం జలమయమవుతున్న నేపథ్యంలో గ్రామస్తుల సౌకర్యార్థం రోడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పనులకు సంబంధించి పంచాయతీ తీర్మానం చేసి ఐదు నెలలైనా సంబంధిత ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గండి సూర్య వెంకట సత్యనారాయణ ఇప్పటివరకూ ఎస్టిమేట్లు ఇవ్వలేదన్నారు. అదేంటని అడిగితే పంచాయతీరాజ్‌ డిఇ రోడ్లు నిర్మాణానికి ఎస్టిమేట్లు ఇవ్వొద్దని చెప్పారని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ చెబుతున్నారని పేర్కొన్నారు. పనులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ వార్డు సభ్యులు కలిదిండి శ్రీనివాస్‌ వర్మ పాల్గొన్నారు.