Jul 15,2021 07:04

గ్రామ పంచాయతీల హక్కులను హరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన జీవో నెంబర్‌ 2ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ఆహ్వానించదగినది. సర్పంచ్‌ల, పంచాయతీ కార్యదర్శుల అధికారాలను విఆర్‌ఓలకు బదిలీ చేయడం, చెక్‌ల జారీ, సెలవుల మంజూరు వంటి అధికారాలను వారికి కట్టబెట్టడం వంటి ప్రభుత్వ చర్యలను ధర్మాసనం తప్పు పట్టింది. ఆ చర్యలతో పంచాయతీలు పేరు గొప్ప ఊరు దిబ్బగా మారుతాయి కాబట్టే న్యాయస్థానం అలా స్పందించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు గ్రామస్వరాజ్య స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. ఈ హితోక్తులు పాలకుల చెవికి ఏ మాత్రం ఎక్కుతాయన్నదే అసలు సమస్య! అభివృద్ధిలో గ్రామాల భాగస్వామ్యం గురించి, ఆ ప్రక్రియలో స్థానిక సంస్థల ప్రాధాన్యత గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకుంటున్నదేం కాదు. మహాత్మాగాంధీ నుంచి ఎందరో నేతలు ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. రాజ్యాంగం లోని 73, 74 సవరణలు స్థానిక సంస్థల స్వావలంబనకు పట్టం కట్టాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఎన్నో సార్లు పంచాయతీలను పరిపుష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ఆ దిశలో తీర్పులూ ఇచ్చింది. అయితే, పాలకులు స్వార్ధ ప్రయోజనాలకు, సంకుచిత ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో గ్రామస్వరాజ్యం అన్న మాట కాగితాలకు, నినాదాలకే పరిమితమైంది. స్థానిక సంస్థలను కబ్జా చేయాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టకొచ్చిందేమీ కాదు. జన్మభూమి కమిటీల పేరుతో గత ప్రభుత్వమూ ఇదే బాట నడిచి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చివేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించక, హక్కులు, అధికారాలు బదిలీ చేయక అంతకు ముందున్న ప్రభుత్వాలు ఇదే బాటన నడిచాయి. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టు రకరకాల సాకులతో స్థానిక సంస్ధలకు ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయని కేంద్ర ప్రభుత్వానిదీ పంచాయతీల హక్కుల భుక్తంలో కీలకపాత్రే!

హక్కులు, నిధులు ఇచ్చి, పాలకులు అండగా నిలిచిన చోట్ల పంచాయతీలు అద్భుతాలను సృష్టించాయి. కేరళ అందుకు గొప్ప ఉదాహరణ. రాజ్యాంగం 11వ షెడ్యూల్‌లోని జాబితాకు అనుగుణంగా ప్రణాళిక - అభివృద్ధి ప్రక్రియలో పంచాయతీలను ఇక్కడి వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. గ్రామస్థాయి నుండి ప్రజలను ప్రత్యక్ష భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజాప్రణాళికను ఆవిష్కరించింది. బడ్జెట్‌లోనే నిధులు కేటాయించడంతో ఎక్కడికక్కడ స్థానిక అవసరాల కోసం రూపొందించుకున్న ప్రజా ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావడమూ సులభమైంది. ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఎక్కడా ఉండకపోవడం, స్థానిక సంస్థల నిర్ణయాలకే పట్టం కట్టడం కేరళ ప్రత్యేకత. పారిశుధ్యంతో పాటు, రోడ్లు, వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు ఇలా శాఖల వారీగా ఎన్నో అంశాల్లో స్థానిక సంస్థలదే అధికారం. ఆరోగ్య రంగంలోనూ కేరళ పంచాయతీలు సాధించిన స్వావలంబనకు కరోనాను కట్టడి చేసిన తీరే నిదర్శనం.

నిధులు, విధులు, అధికారాలను బదిలీ చేస్తే పంచాయతీలు ప్రజాపాలనకు బాటలు వేస్తాయని కేరళ అనుభవం స్పష్టం చేస్తోంది. మన రాష్ట్రంలో బదిలీ చేసిన హక్కులు, అధికారాలే పరిమితం. ఆ కొద్దిపాటి వాటికీ కోత వేయాలని చూడటం బాధాకరం. సచివాలయాల ఏర్పాటుతో గ్రామస్థాయిలో పాలనా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది ప్రజలచే ఎన్నుకోబడ్డ గ్రామ పంచాయతీలకు పోటీగా లేదా వాటి హక్కులను, అధికారాలను హరించేవిధంగా ఉండకూడదు. హైకోర్టు ఆదేశాల తరువాతైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. గ్రామ సచివాలయాలను గ్రామ పంచాయతీలకు జవాబుదారీగా చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు అధికారాలను అప్పగించాలి. నిధులు విడుదల చేయడం ద్వారా తమను తామే పాలించుకునే విధంగా పంచాయతీలను ఎదగనివ్వాలి. ఆ దిశలో తీసుకునే చర్యలే గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తాయి. దీనికి భిన్నంగా వివాదాస్పద జీవో లో సాంకేతిక మార్పులు చేసి బయటపడాలని చూస్తే అది హ్రస్వదృష్టే అవుతుంది. గ్రామాల దీర్ఘకాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.