గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి - గ్రామ సందర్శనలో ముదినేపల్లి సర్పంచి కైకమ్మ
ప్రజాశక్తి - ముదినేపల్లి
ముదినేపల్లి సర్పంచి నిమ్మగడ్డ కైకమ్మ సోమవారం గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలను సందర్శించి వాటి పనితీరు, లోపాలు గుర్తించారు. ముఖ్యంగా ముదినేపల్లి ప్రభుత్వ బాలికల వసతి గృహం సందర్శించి ఆమె అవాక్కయ్యారు. వసతి గృహం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. భవనం కూలేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే భవనం ఖాళీ చేసి బాలికలకు వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉందని గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు మరుగుదొడ్లు సౌకర్యవంతంగా లేవని గుర్తించారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రహారీ నిర్మించాల్సి ఉందని, ముదినేపల్లి పశ్చిమ మండల పరిషత్ పాఠశాల అవరణంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నట్లు గుర్తించారు. రోడ్డు కన్నా పాఠశాల ఆవరణ పల్లంగా ఉండడంతో ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుసుకున్నారు. వాటర్‌స్కీంను సందర్శించి సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆనంతరం సర్పంచి కైకమ్మ మాట్లాడుతూ గ్రామ పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆనంతరం సచివాలయం వద్ద వల్లభారు పటేల్ జయంతిని పురష్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి ఈడే సుధాకర్, వైసిపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు నిమ్మగడ్డ భిక్షాలు, పంచాయతీ కార్యదర్శి టివి.సారధి, ఎంపిటిసి కోటయ్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు గిరిరాజులు, నాని, ఈడే ఉమ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.










