రాయచోటి టౌన్ : గ్రామ సేవకులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట గ్రామ సేవకులు మోకాళ్లపై కుర్చోని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి గ్రామ సేవకులను రెగ్యులర్ చేస్తానని, వేతనం పెంచుతానని, పిఆర్‌సి అమలు చేస్తానని అబద్దపు హామీలతో పోస్టులు వేయించుకుని అధికారం చేపట్టిన తర్వాత హామీలు అమలు చేయకపోగా ఇచ్చిన డిఎను వెనక్కి లాక్కున్నారని వాపోయారు. డిఎ రూ.300 నుంచి రూ.600 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. విఆర్‌ఎ వ్యవస్థ రద్దు చేయాలనే ఆలోచన విరమించుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నామినీలను విఆర్‌ఎలుగా నియమించాలని, అర్హులైన వారికి ఉద్యోగోన్నతులు కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. విఆర్‌ఎ వ్యవస్థ లేకుండా చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, వచ్చే ఎన్నికల్లో గ్రామ సేవకులు బుద్ది చెబుతారని తెలిపారు. డిఎలు ఇవ్వాలని రీ సర్వేలో పాల్గొంటున్న ప్రతి విఆర్‌ఎకు టిఎ, డిఎతోపాటు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలన్నారు. వేసవిలో తీవ్ర ఎండలకు రీ సర్వేలో పాల్గొని గుండెపోటుతో చని పోయిన గ్రామ సేవకుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకో వాలన్నారు. కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని తెలిపారు. వారికి ప్రత్యేక అలవెన్స్, రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని పేర్కొన్నారు. గుర్తింపు కార్డు లతో పాటు సంక్షేమ పథకాలు అమలుచేయాలని ప్రతి ఒక గ్రామ సేవకునికీ 2 ఎకరాల భూమి, 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్‌ఒ సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సేవకుల సంఘం జిల్లా కో- కన్వీనర్ జి.భోగేశ్వరయ్య రైల్వేకోడూరు డివిజన్ అధ్యక్షుడు కె.సుధాకర్, కలికిరి రెడ్డెప్ప, పెనగలూరు మధు, శీను రాయచోటి అధ్యక్షులు పి.నర్సింహులు ఆర్.రామ్మోహన్, చండ్రాయుడు, రామయ్య, శివప్రసాద్, ఆంజనేయులు పాల్గొన్నారు.










