May 09,2023 00:22

మాట్లాడుతున్న జొన్న శివశంకరరావు,నాయకులు

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌:ప్రజల కోసం నిరంతరం పనిచేసిన డోకిపర్తి చలపతిరావు, చొక్కా దావీదులు ధన్య జీవులని, వారి కృషి మరువలేనిదని సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు అన్నారు. సోమవారం ప్రాతూరి గ్రామంలో మాజీ సర్పంచులు, సిపిఎం నాయకులు డోకిపర్తి చలపతిరావు, చొక్కా దావీదుల 26వ వర్ధంతి సభ, సిపిఎం ప్రాతూరు గ్రామ శాఖ కార్యదర్శి డోకి పర్తి రాజేంద్ర బాబు అధ్యక్షతన జరిగింది. ముందుగా చలపతిరావు, దావీదుల చిత్రపటాలకు సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ సిపిఎం నాయకులుగానూ, గ్రామ సర్పంచులుగానూ గ్రామ అబివృద్ధి కోసం డోకిపర్తి చలపతిరావు పనిచేశారని అన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం చేపట్టడంలోనూ, ఇసుక క్వారీ కార్మికుల సమస్యల పైన చలపతిరావు పనిచేశారని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామంలో రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేపట్టి ప్రజల ఆదరాభిమానాలు పొందారని అన్నారు. అంతేకాకుండా గ్రామంలో సిపిఎం అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. ప్రస్తుతం దేశంలో మతోన్మాద బిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పరిపాలన సాగిస్తుందని సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మతోన్మాద బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోనూ వైసిపి అనుసరిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. వివక్షకు వ్యతిరేకంగా, దళితులు, పేద ప్రజల సమస్యలు పైన సిపి ఎం పోరాటం చేస్తుందని అయన అన్నారు. ఈ కార్యక్రంలో ఏపి కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కష్ణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి బత్తుల సంసోను, సీపీ ఎం నాయకులు డోకిపర్తి కోటయ్య, దాసరి సురేష్‌, పుల్లగూర బిక్షాలు, రవి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.