Oct 15,2023 00:16

ప్రజాశక్తి - అద్దంకి
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర చేశారు. మండలంలోని మోదేపల్లి గ్రామంలోని పోలేరమ్మ తల్లి, శ్రీ సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఆయన సైకిల్‌ యాత్రకు రాళ్ళపల్లి, కుంకుపాడు, కొటికలపూడి గ్రామాల వద్ద మహిళలు, చిన్నారులు హారతులిచ్చి స్వాగతం పలికారు. తిమ్మాయిపాలెం ఎన్‌టిఆర్‌ విగ్రహాం వరకు సైకిల్ యాత్ర సాగింది. 10 కిలోమీటర్లు సైకిల్ యాత్రచేస్తూ చంద్రబాబు అక్రమ అరెస్టులో ప్రభుత్వ వైఖరిని, నిర్భందాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం స్థానిక అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సిపి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. చంద్రబాబు అరెస్టు, నిర్భంధం, కక్షసాధింపు ధోరణిని యావత్ ప్రజలు చూస్తున్నారని అన్నారు. జైలులో ఉన్న 2వేల మందికి ఖైదీలకన్నా చంద్రబాబుకు ఏమైనా ప్రత్యేకత ఉంటుందా అంటూ వైసిపి నేతలు  అవహేళనగా మాట్లాడుతున్నారని అన్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ప్రత్యేక వసతులు, వైద్య చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదాని ప్రశ్నించారు? రాష్ట్రం విడిపోయినప్పుడు రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు బస్సులో ఉండి ప్రభుత్వాన్ని నడిపి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులా పాలన చేశారని గుర్తు చేశారు. మహిళలకు రూ.11వేల కోట్ల సబ్సిడీ ఇచ్చిన ఘనత  చంద్రబాబుదేనని అన్నారు. మహిళలు స్వతంత్రంగా జీవించేందుకు కుట్టుమిషన్, పెయింటింగ్, అల్లికలు, చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ, పంట భీమా పథకం, అసంఘటిత కార్మికులకు చంద్రన్నభీమా, ఆర్దిక ఇబ్బందుల వలన  అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సిఎం సహౕయనిధి, ఆడబిడ్డలకు తల్లి తండ్రి సంతోషంగా పెళ్ళి చేయాలనే సంకల్పంతో చంద్రన్న పెళ్లి కానుక, దుల్హన్ పధకం, వెనుకబడిన తరగతుల వారికి సబ్సిడీపై రుణాలు మంజూరు, నిరుద్యోగ యువతకు యువనేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. గతంలో తిమ్మాయపాలెం, గుండ్లకమ్మ నదిలో పూర్తిస్థాయిలో రెండు వైపులా అనుకొని నీళ్లు ఉండేవని, నేడు ఆపరిస్థితి లేదని అన్నారు. కనీసం గేదెలు తాగేందుకు కూడా నీరు లేకపోవడం వైసిపి ఇసుక మాఫియా పుణ్యమేనని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రూ.200ఉన్న పింఛన్లను రూ.వెయ్యికి పెంచారని అన్నారు. 2018లో చంద్రబాబే మరోసారి పెంచి రూ.2వేలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ఒక్కడే రూ.1800పెన్షన్‌ పెంచాడని అన్నారు. జగన్‌ పాదయాత్రలో రూ.3వేలు చేస్తానని అధికారానికి వచ్చిన తర్వాత సంవత్సరానికి రూ.250మాత్రమే పెంచి మోసం చేశాడని అన్నారు. జగన్‌ నాలుగేళ్లలో కేవలం రూ.750మాత్రమే పెన్షన్‌ పెంచాడని అన్నారు. టిడిపి హయాంలో మహిళలకు రూ.11వేల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని అన్నారు. జగన్‌రెడ్డి విద్యుత్ చార్జీల పేరుతో ప్రజల రక్తాన్ని జలగలా పీలుస్తున్నాడని అన్నారు. విద్యుత్ రంగాన్ని జగన్‌ సర్వనాశనం చేశాడని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు. అలాంటిది జగన్ నాలుగేళ్లలో ఇప్పటికి 9సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. వర్షాకాలంలో కూడా అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. అవినాష్ రెడ్డికి చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి రూ.2624కోట్లతో నాసిరకం విద్యుత్ పరికరాలను కొని వాడటం వల్లనే విద్యుత్ కోతలు, లో వోల్టేజీ సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు.  ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న జగన్ హామీ విషయంలో మడమ తిప్పేశాడని అన్నారు. కేంద్రం 2019లో ఇచ్చిన రూ.900కోట్ల కరవు సాయం నిధులనూ రైతుల ఖాతాల్లో జగన్‌ జమ చేయలేదన్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. టిడిపి ప్రభుత్వ కాలంలో మిగులు విద్యుత్‌ ఉన్న ఎపి ఇప్పుడు కోతలు విధించే స్థాయికి దిగిపోయిందన్నారు. రాష్ట్రానికి పరిశ్రలను తెప్పించేందుకు పదేళ్ల ప్రణాళికతో పనిచేసే ప్రభుత్వం అవసరమని అన్నారు. అలాంటి పని టిడిపి మాత్రమే చేయగలదని అన్నారు. టిడిపిని, ప్రతిపక్షాలను అణచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబును, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.