Oct 07,2023 01:25

ప్రజాశక్తి - అద్దంకి
చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ భారీ సైకిల్ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. మండలంలోని నాగులపాడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రారంభమై సైకిల్‌ యాత్ర కొంగపాడు మీదుగా మణికేశ్వరం ఎస్సి కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 10కిలోమీటర్ల పొడవున సాగిన సైకిల్ యాత్రలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సైకిల్‌ తొక్కారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసుతో సంబంధం లేకపోయినా అక్రమంగా నిర్బంధించిందని అన్నారు. దీనికి రాబోయే రోజుల్లో వైసిపి తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబుని క్యాంపు సైట్లో అర్ధరాత్రి చొరబడి అలజడులు సృష్టిస్తూ బాబు నిద్రిస్తున్న సమయంలో వాహనం తలుపులు తట్టి అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని అన్నారు. అక్రమ అరెస్టుకు నిరసనగా గ్రామస్థాయిలో కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే వైసిపి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి నిరసనలను కూడా అణచివేయాలనే దుర్బుద్ధితో జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వం నిరసనలు అణిచివేస్తూ బయటి ప్రపంచానికి చంద్రబాబుకి ప్రజా మద్దతు లేదని దుష్ప్రచారం చేయాలనూ కుట్రలు పన్నుతున్నాడని అన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని అదరక బెదరక కుట్రలను తిప్పికొడుతూ ప్రతి గ్రామంలో రోజు ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతున్న టిడిపి శ్రేణులు, సామాన్య ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. గుండ్లకమ్మ జలాశయ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 20నెలలైనా అమర్చకపోవడం వైసిపి పనితీరుకు నిదర్శనం అన్నారు. టిడిపి సందర్భన తర్వాత జలవనరుల శాఖ మంత్రి నెల రోజులలోపే గేట్లు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారని అన్నారు. ప్రాజెక్టు పరిధిలోని లక్ష ఎకరాలకుపైగా సాగు, రెండువేల మత్స్యకార కుటుంబాలకు జీవనం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే పట్టించుకోకపోవడమే పేదల సంక్షేమమా అని సిఎంను ప్రశ్నించారు. గేట్లు పెట్టకపోవడం వెనుక కుట్ర కోణం ఉందని అన్నారు. ఇసుక మాఫియా కోసమే గేట్లు పెట్టలేదని ఆరోపించారు. ముంపు గ్రామాలైన తమ్మవరం, మణికేశ్వరం, అనమనమూరు, మోదేపల్లి నదీ పరీవాహక ప్రాంతంలో వైసిపి నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా చెలరేగి పోతుందని అన్నారు. గత ప్రభుత్వంలో ముంపు గ్రామాల సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపామని అన్నారు. అక్రమంగా ఓట్ల నమోదు, తొలగింపు చేసే ఏ అధికారిని, ఉద్దేశపూర్వకంగా టిడిపి శ్రేణులను ఇబ్బందులు గురి చేసి అత్యుత్సాహం చూపే ఏ పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.