
ప్రజాశక్తి - ప్రత్తిపాడు : మండలంలోని గొట్టిపాడులో 2018 జనవరి 1న గ్రామంలో తలెత్తిన ఘర్షణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి బాధిత దళితులు ప్రభుత్వం నుండి పరిహారం కోసం హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయడంతో విచారణకు కోర్టు ఆదేశించింది. దీంతో జిల్లా ఎస్పీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, రేజీ ఐజి, జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ అయిన జి.పాలరాజు, ఆర్డీవో పి.శ్రీఖర్ కలిసి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. అనంతరం పిటిషన్ దాఖలు చేసిన వారితో ప్రత్తిపాడులోని తహశీల్దార్ కార్యాలయ అవరణలో సమావేశమయ్యారు. వారి నుండి వివరాలు తెలుసుకుని రికార్డు చేయడంతోపాటు రాతపూర్వక వాగ్మూలాలనూ తీసుకున్నారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ విచారణకు పిటీషనర్లందరూ దాదాపు హాజరయ్యారని, వారి చెప్పిన అంశాలన్నింటినీ పరిశీలిస్తామని చెప్పారు. ఘటనలు జరిగినప్పుడు తీసుకున్న చర్యలనూ పరిగణలోకి తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు సుప్రజ, కె.కోటేశ్వరరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కె.స్వాతి, డిఆర్‌డిఎ పీడీ హరిహరనాథ్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదనరావు , తహశీల్దార్ సిద్ధార్ధ, ఎంపిడిఒ శ్రీరమ్య పాల్గొన్నారు.