ప్రజాశక్తి-కొయ్యూరు
మండలంలోని యు.చీడిపాలెం, బూదరాళ్ల పంచాయితీల పరిధిలోని గొట్టెలపాడు గెడ్డపై వంతెన నిర్మాణం చేయకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ గెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు సాగించలేదని స్థితి నెలకొంది. మండలంలోని యు.చీడిపాలెం పంచాయితీ పరిధి గొట్టెలపాడు గెడ్డపై వంతెనకు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ఇది జరిగి ఐదు నెలలు పూర్తి కావస్తున్నా నేటికీ వంతెన పనులు కార్యరూపం దాల్చలేదు. దీంతో వర్షాలు పడుతున్న సమయంలో యు.చీడిపాలెం, గొట్టెలపాడు, ఉల్లిగుంట, ఎర్రగొండ, వేమన పాలెం, తీగల మెట్ట, నీలవరం, పాలసముద్రం, మర్రిపాపలు, జెర్రిగొంది, తాబేలు గండి తదితర గ్రామాలు గిరిజనులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రికి వెళ్లాలన్నా, ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకుని గొట్టెలపాడు గెడ్డపై వంతెన నిర్మాణం త్వరితగతిన చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా పంచాయతీల గిరిజనులు కోరుతున్నారు.










