Aug 24,2023 21:44

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న మన్యం జిల్లా అటవీ శాఖ రేంజర్‌ రాజశేఖర్‌

* ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* మన్యం జిల్లా డివిజన్‌ రేంజర్‌ రాజశేఖర్‌
ప్రజాశక్తి - సరుబుజ్జిలి: 
మండలంలోని అమృతలింగానగరం పరిధిలోని జగనన్న కాలనీ వద్ద గొర్రెల మందలోని ఒక గొర్రెను పులి చంపి, మరో గొర్రెను మంగళవారం రాత్రి ఎత్తుకెళ్లింది. గోనెపాడుకు చెందిన గొర్రెల పెంపకందారుడు మల్లేశ్వరరావు స్థానికులకు విషయం చెప్పడంతో వారు అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ డివిజన్‌ రేంజర్‌ రాజశేఖర్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సంచరించిన పులి అడుగులు... ఇక్కడ సంచరించిన పులి అడుగులు ఒక్కటేనని తమ పరిశీలనలో తేలిందని స్పష్టం చేశారు. కొత్తూరు మండలం గులివిందలపేట ప్రాంతంలో బుధవారం సంచరించిన పులి, గురువారం సరుబుజ్జిలి మండలానికి చేరుకున్నట్లు గుర్తించామన్నారు. ఇది బెంగాల్‌ టైగర్‌ అని.. ఐదేళ్ల వయసు, 180 నుంచి 250 కేజీల బరువు, ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుందని వివరించారు. ఇది వేకువజామున, ఉదయం పూట ఎక్కువగా ప్రయాణం చేస్తుంటుందని తెలిపారు. వేకువజామున పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడికి వెళ్లినా గుంపులు గుంపులుగా వెళ్లాలన్నారు. గొర్రెను పోస్టుమార్టం కోసం పంపించామని, నివేదిక రావాల్సి ఉందన్నారు. పులి వెన్నెలవలస దాటి సీతంపేట వైపు వెళ్లి ఉంటుందని, అక్కడ్నుంచి ఒడిశా వైపు వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు.