
ప్రజాశక్తి-గుంటూరు : ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామినాథన్ గొప్ప మానవతావాది అని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. జెవివి ఆధ్వర్యంలో స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ దేశంలో ప్రజలు ఆకలితో చనిపోయే పరిస్థితుల్ని చూసి చలించిపోయి, వ్యవసాయ శాస్త్రవేత్తగా అనేక అధిక దిగుబడులిచ్చే వంగడాలను కనుగొన్నారని, నేడు ఆహార పదార్థాలు మిగులు స్థాయికి తీసుకురావటానికి ఆయన చేసిన కృసి అమోఘమని చెప్పారు. ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎం.ఎస్.స్వామినాథన్ శాస్త్రవేత్తగా పరిశోధనలు చేయటమే కాకుండా రైతుల సమస్యలపై విశేష అధ్యయనం చేశారని, పంటల మద్దతు ధరకు, మహిళా రైతుల సమస్యలపై, ఆహార భద్రత చట్టం కోసం కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు వివికె.సురేష్, డాక్టర్ ఎ.సత్యనారాయణ ప్రసాద్, బి.ప్రసాద్, నేతాజి, పి.వెంకటేశ్వరరావు, సిహెచ్.ఆదినా రాయణ, బి.ఉదయభాస్కర్, ఎస్‌ఎం సుభాని, జి.వెంకటరావు, బి.శంకర్‌సింగ్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్ : వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ఇవ్వాలని రైతు నాయకులు కోరారు. స్వామినాథన్ సంస్మరణ సభ స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి అఖిలపక్ష రైతు సంఘం నాయకులు కె.హరిబాబు అధ్యక్షత వహించగా కౌలురైతు సంఘం మండల కార్యదర్శి కె.శివనాగేశ్వరరావు, తెలుగు రైతు నాయకులు ఆర్.శివరామకృష్ణయ్య, సిఐటియు నాయకులు కె.నాగేశ్వరరావు, ఎస్‌టియు నాయకులు జి.మోహన్‌రావు, రైతు సంఘం నాయకులు బి.శంకరయ్య మాట్లాడారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయడం ద్వారా ప్రభుత్వాలు ఆయన మృతికి నివాళులర్పించాలన్నారు. స్వామినాథన్ సూచించిన సి2 ప్లస్ 50 శాతం ఫార్ములాను అమలు చేస్తే దేశంలో రైతులకు మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు. గుంటూరు ఛానల్ విస్తరణ పూర్తయితే ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరతాయని దీర్ఘకాలికంగా పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా రైతులకు కేంద్రం ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు. తొలుత స్వామినాథన్ చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. సభలో నాయకులు జె.రామారావు, డి.రమేష్‌బాబు, ఎన్.శివప్రసాద్, సుభాని, ఎం.వెంకటేశ్వర్లు, బి.భోగేశ్వరరావు, జవహర్‌రాణి, సిహెచ్.యానాదులు, ఎం.రమణ, గాలీబు, ఎన్.పుర్ణచంద్రరావు, కె.వెంకట సుబ్బారావు పాల్గొన్నారు.