Feb 17,2023 23:12

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: తెలుగు సాహిత్యానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ప్రముఖ కవి బెల్లంకొండ రామదాసు అని పలువురు వక్తలు అన్నారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న 33వ పుస్తక మహోత్సవ్‌లోని గొల్లపూడి మారుతీరావు సాహిత్య వేదికపై శుక్రవారం బెల్లంకొండ రామదాసు శత జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు రెంటాల జయదేవ్‌ మాట్లాడుతూ బెల్లంకొండ రామదాసు అతి తక్కువ సమయంలోనే గొప్ప కవిగా ఎదిగారని అన్నారు. ఆయన ఎన్నో రచనలు, కథలు, నాటకాలు రాశారని సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. సభకు అధ్యక్షత వహించిన అనువాద సాహితీరత్న వెన్నా వల్లభరావు మాట్లాడుతూ 1940లో కవిగా రామదాసుకు మంచి గుర్తింపు వచ్చిందని 17 సంవత్సరాల వయసులోనే శ్మశానం పేరుతో కవితా సంపుటి రచించారని, 1944లో రామదాసుతో పాటు మరో ఇద్దకు కవులు కలసి నయాగరా కవితా సంకలనాన్ని రచించారన్నారు. అభ్యుదయ భావాలతో కలివ్వ రచన నూతన శైలిలో రచించారని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య, గోళ్ల నారాయణరావు పాల్గొన్నారు. పుస్తక మహోత్సవ్‌లోని ప్రతిభా వేదికపై తోలు బొమ్మలాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను తెలియచేస్తూ నిర్వహించిన బొమ్మలాట సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.
పుస్తక మహోత్సవ్‌లోని గొల్లపూడి మారుతీరావు సాహిత్య వేదికపై రచయిత డాక్టర్‌ ఆనంద్‌ మోహన్‌ రచించిన డ్రాప్‌ ఫాలెన్‌ యూ ఆర్‌ నాట్‌ ఎలోన్‌ పుస్తకావిష్కరణ జరిగింది. పుస్తకాన్ని లాండ్‌ అండ్‌ సీలింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ ఎ.ఎం.డి.ఇంతియాజ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ చెన్నారెడ్డి, సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల లెక్చరర్‌ ప్రసూన, జీఆర్‌కే పోలవరపు సాంస్కృతిక సమితి నిర్వాహకులు గోళ్ల నారాయణరావు పాల్గొన్నారు.
రూ.50కే శ్రీశ్రీ మహా ప్రస్థానం
పుస్తక మహోత్సవ్‌లోని రెడ్‌ బుక్‌ డే స్టాల్‌లో రూ.50కే శ్రీశ్రీ ప్రస్థానం పుస్తకాన్ని అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెడ్‌ బుక్‌ డే స్టాల్‌ను శుక్రవారం సాయంత్రం సిపిఎం రాష్ట్ర నాయకులు పి.మధు సందర్శించారు. ఈ సందర్భంగా స్టాల్‌లోని పలు పుస్తకాలను పరిశీలించారు. అనంతరం ప్రజాశక్తి బుక్‌స్టాల్‌తో పాటు పలు స్టాల్స్‌ను సందర్శించారు.
నేటి కార్యక్రమాలు
గొల్లపూడి మారుతీరావు సాహిత్య వేదికపై సాయంత్రం ఏడు గంటలకు ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రచురణల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. హిందుత్వ పునరాగమనం, గాంధీజీ హంతకుడు గాడ్సే పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎమ్మెల్సీ కె.యస్‌.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీలు మాణిక్య వరప్రసాద్‌, ఎం.వి.ఎస్‌.శర్మ, అతిధులుగా ప్రజాశక్తి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై.అచ్యుతరావు, అనువాదకురాలు కె.ఉషారాణి పాల్గొంటారు. సభా కార్యక్రమానికి ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌ అధ్యక్షత వహించనున్నారు.