న్యూఢిల్లీ : గోవా, ఉత్తరాఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల్లో ప్రచారం శనివారంతో ముగిసింది. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దశలో ఈ నెల 14న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం చేశాయి. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఎఐసిసి ఇన్‌ఛార్జి దినేష్ గుండూరావుతో కలిసి కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం శనివారం మీడియాతో మాట్లాడారు. బిజెపి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు అభివృద్ధి పనులపై వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఉత్తరాఖండ్‌లో స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం
ఉత్తరాఖండ్‌లోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రియాంక గాంధీ వరుస ర్యాలీలు నిర్వహించారు. ఖతిమాలో శనివారం జరిగిన 'ఉత్తరాఖండ్ స్వాభిమాన్' ర్యాలీలో ఆమె ప్రసంగించారు. మోడీ తన స్నేహితులైన ఇద్దరు పారిశ్రామికవేత్తల కోసమే విధానాలు రూపొందిస్తు న్నారని విమర్శించారు. పేదలు, రైతులు, మధ్యతరగతి, చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు ఏమీ అందించని బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెహ్రీలోని ఒక సభలో ప్రసంగించారు. రుద్రాపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ, రారుపూర్ సభలో అమిత్ షా ప్రసంగించారు.










