
ప్రజాశక్తి-గుంటూరు : స్పెషల్ సమ్మరీ రివిజన్-2024లో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు మండలం పరిధిలోని చల్లావారిపాలెం, గోరంట్లలో తొలగించిన ఓటర్లు, ద్వంద ఓటర్లు, డెత్ కేసులు, కొత్త ఓటర్ల నమోదు వివరాలను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి బుధవారం ఇంటింటికి వెళ్లి ర్యాండమ్‌గా పరిశీలించారు. 2020 జనవరి 6వ తేది నుండి 2023 జూలై 20వ తేది వరకు ఉన్న కాలానికి సంబంధించి తొలగించిన ఓటర్లు, డెత్ కేసులు , షిప్టెడ్ ఓటర్ల ద్వంద ఓటర్ల వివరాల వాస్తవాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు చల్లావారిపాలెం పోలింగ్ స్టేషన్ నెం.73, గోరంట్లలోని పోలింగ్ స్టేషన్ నెం.38లోని ఓటర్లతో మాట్లాడి, రికార్డులలో నమోదు చేసిన వివరాలతో కలెక్టర్ నిర్ధారించుకున్నారు. చనిపోయిన ఓటర్లకు సంబంధించి బిఎల్‌ఓలకు అందించిన మరణ ధ్రువపత్రాలను పరిశీలించారు. తొలగించిన ఓటర్లు, షిప్టెడ్ ఓటర్లకు సంబంధించి బిఎల్‌ఓలు నమోదు చేసిన వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. క్లెయిమ్స్‌కు సంబంధించి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సజావుగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెన్షన్లు అందుతున్నాయా? ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు ఉన్నాయా? ఇంటి వద్దకే వచ్చి వాహనం ద్వారా రేషన్ బియ్యం సకాలంలో అందిస్తున్నారా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, చేయూత పథకాలు అందుతున్నాయా? అని ఆరా తీశారు. చల్లావారిపాలెం, పోలింగ్ స్టేషన్ నెం.73లో నివాసం ఉంటున్న షేక్.మస్తాన్‌బి తనకు ఇటీవల డ్వాక్రా రుణం రూ.1.50 లక్షలు అందిందని, అయితే తనకు వితంతు పెన్షన్ రావట్లేదని విన్నవించగా, డిఆర్‌డిఎ పీడీ హరిహరనాథ్‌తో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడారు. లబ్ధిదారు నుండి వెంటనే వివరాలు సేకరించి వితంతు పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట గుంటూరు ఆర్‌డిఒ ప్రభాకర్‌రెడ్డి, గుంటూరు తూర్పు, పశ్చిమ తహశీల్దార్లు నగేష్, సాంబశివరావు, విఆర్‌ఒ గాయత్రి, బిఎల్‌ఒలు సల్మా, అరుణ కుమారి, సూపర్వైజర్లు పాల్గొన్నారు.