ఈ సంస్థలకు ఇప్పుడు చేతి నిండా పని పడింది. ఇక్కడ సంచార జీవులైన ముస్లింలను భయపెట్టి వెళ్లగొడితే, లేకపోతే వారి జీవనాధారాన్ని తెగ్గొట్టి ఆర్థికంగా దెబ్బ తీసి హిందువుల ప్రాబల్యం పెంచితే రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒకటి- హిందూ మెజారిటీ ప్రాంతంగా జమ్మూని తయారు చేసి, ముస్లిములను అణచవచ్చు. రెండు- ఈ సంచార జీవుల ఆస్తులను జప్తు చేసుకొని పెట్టుబడిదారులకు అప్పచెప్పవచ్చు. మనం గత కొద్ది రోజులుగా వింటున్న 'డీలిమిటేషన్, డెమోగ్రాఫిక్ ఛేంజెస్' అనే పదాలకు తాత్పర్యం ఇదే.
జమ్మూకాశ్మీర్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు కలలు కంటున్న రాజ్యం స్వరూపం ఎలా ఉంటుందో గత కొద్ది నెలలుగా ప్రపంచానికి కళ్లకు కడుతోంది. సమస్య ఏమిటంటే కళ్లున్నా కొన్ని చూడటానికి చాలామంది ఇష్టపడరు. 3000 రూపాయలకు అమెజాన్ లో దొరికే, కొన్ని మీటర్లు మాత్రమే ఎగిరే డ్రోన్ దేశభద్రతకు ముప్పు తెచ్చేసిందని వార్తా కాలమ్స్ దింపేసి గుండెలు బాదుకొనే దినపత్రికలకు అసలు కళ్లే ఉండవు. కళ్లకు అర్థం 'చూపు' అని కూడా నేను ఇస్తాను.
2020 ఆగస్టు 16న, రేయసి జిల్లా లోని గర్రి గబ్బర్ గ్రామంలో మహమ్మద్ అస్ఘర్ అనే ఒక ముస్లిం గొర్రెల కాపరి మీద 60 మంది రాళ్లతో, కర్రలతో, వట్టి చేతులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని పొలంలోకి ఆవులు వచ్చి పాడు చేస్తుంటే వాటిని బయటకు తోలడమే అతను చేసిన తప్పు. అలా తోలుతున్నపుడు ఒక ఆవుకు చిన్న గాయం అయ్యింది. కోపగించిన గ్రామ పెద్దలు అతన్ని పంచాయితీకి పిలిచారు. అస్ఘర్, అతని కొడుకు జావీద్ పంచాయితీకి రాగానే గో పరిరక్షకులు అతని మీద దాడి చేసి కొట్టారు. అంతటితో వాళ్ల కష్టాలు తీరలేదు. 16 ఏళ్ల జావీద్ మీద 'జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం' కింద పోలీస్ కేసు ఇప్పుడు ఉంది.
2021 మే 8న, జమ్మూ జిల్లా లోని గర్హోతే గ్రామానికి చెందిన గుజ్జార్ అనే సంచార జాతికి చెందిన మహమ్మద్ సిద్దిక్, అమీర్ హుస్సేన్ లు -పక్క గ్రామం నుండి రెండు ఎద్దులను కొనుక్కొని తిరిగి వస్తుండగా జమ్మూ జిల్లా గూండాలు వాళ్ల మీద దాడి చేశారు. తాము పశు వ్యాపారులం కాదని మొత్తుకొని చెప్పినా నిర్దయగా వారిని కొట్టారు. వారిద్దరిని హాస్పిటల్ లో చేర్చాల్సి వచ్చింది.
మే 26న జమ్మూ లోని సాంబా జిల్లాకు చెందిన బకర్వాల్ అనే సంచార జాతికి చెందిన ఆరు కుటుంబాల వాళ్లు పశువులను ట్రక్‌లో తోలుకొని వస్తుండగా వారిపైన ఆవు పరిరక్షకులమని చెప్పుకొనే వాళ్లు దాడి చేశారు. పిల్లల్ని కూడా వదలకుండా గాయపరిచారు. వీళ్లు ప్రతి వేసవిలో ఆవులను మేపుకోవటానికి కాశ్మీర్ లోయ లోని పచ్చిక బయళ్లకు వెళుతుంటారు. ఇంతకు ముందు కాలి నడకన వెళ్లేవాళ్లు. ఇప్పుడు కొద్దిగా వారి ఆర్థిక స్థితులు మెరుగు పడటంతో ట్రక్కుల్లో పశువులను తీసుకొని వెళుతున్నారు. అలాగే ఈసారి కూడా రెండు ట్రక్కుల నిండా పశువులను తోలుకొని కుటుంబాల సమేతంగా బయలుదేరారు. వాళ్ల దగ్గర జిల్లా మేజిస్ట్రేట్ నుండి, స్థానిక అధికారులు, పోలీసుల వరకు-అందరి అనుమతుల కాగితాలు ఉన్నాయి. ఆవు సంరక్షకులు వెంబడించగానే వాళ్లు రక్షణ కోసం చెక్ పాయింట్ దగ్గర ఉన్న పోలీసుల దగ్గరకు వేగంగా పారిపోయారు. అక్కడ పోలీసుల సమక్షంలోనే గూండాలు-ఆడవాళ్లు, పిల్లలతో సహా అందరినీ చంపాలన్నంత ప్రతీకారంతో కొట్టారు.
గో సంరక్షకుల పేరుతో అంతకు ముందు నుండే దాడులు జరుగుతున్నా, జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత ఇలాంటి ఘటనలు డజన్ల కొద్ది జరిగాయి.
జూన్ 22న జరిగిన ఘటన ఈ హింసను తారాస్థాయికి, హత్య వరకూ తీసుకొని వెళ్లింది. రాజౌరి జిల్లా తానమండికి చెందిన అయిజాజ్ దార్ ఒక బర్రెను కొనుక్కొని తిరిగి వస్తుండగా అతని మీద తీవ్రంగా దాడి చేశారు. గాయాలతో అతను జమ్ము మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో చనిపోయాడు. అతని తోటివాళ్లు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన అయిజాజ్ దార్ కు ముగ్గురు చెల్లెళ్లు, పక్షవాతం వచ్చిన తండ్రి, ముసలి తల్లి ఉన్నారు. ఆ కుటుంబం అంతటికీ అతనే అన్నం పెట్టేది.
జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ ప్రాంతంలో -కతువా, సాంబా, జమ్ము, ఉధంపూర్ జిల్లాలు దక్షిణంగా ఉంటాయి. అక్కడ 10 శాతం మాత్రమే ముస్లిములు ఉంటారు. అదే జమ్మూ ప్రాంతపు ఉత్తర జిల్లాలైన రాజౌరి, పూంఛ్, దోడా, కిశ్త్వర్, రాంబన్, రేయసి జిల్లాలలో మెజారిటీ ముస్లిములు నివశిస్తుంటారు. ఈ ప్రాంతాల నుండి పశువుల, గొర్రెల కాపరులు అయిన సంచార జాతులు వారు ఎక్కువగా ఉంటారు. రాజౌరి జిల్లా ఈ ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సరిహద్దుగా ఉంటుంది. రాజౌరి జిల్లాలోని నౌషెర, సుందర్ బని తాలూకాలలో కూడా హిందువులు ఎక్కువగా ఉంటారు.
గోరక్ష పేరుతో హింస దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతోంది. అయితే అదిప్పుడు ఉత్తర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఎందుకంటే ఈ ఉత్తర జిల్లాల వాళ్లు కూడా పశువులను కొనటానికి దక్షిణాది జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. గోసంరక్షణ పేరుతో రాజకీయాలు జరుగుతున్న ఈ సందర్భం ఉత్తరాదివారిని కూడా వదలటంలేదు.
డోగ్రా రాజుల కాలంలో గోహింస జరగకూడదనే చట్టాలు ఉన్నా, పశువులను కాసుకొనే హక్కులు ఉండేవి. ఆ తరువాత కాలంలో...ముస్లిమ్ సంచార జీవులు స్వేచ్ఛగా తమ పశువులను కాసుకొంటూ పీర్ పంజల్ పర్వత శ్రేణిలో వేసవిలో తిరుగుతారు. ఉత్తర, దక్షిణ జమ్మూ ప్రాంతాల నుండి ఈ సంచారం జరుగుతుంది.
ఇటీవల కాలంలో పశు సంచారక ప్రాంతాల్లో వాళ్ల ఇళ్లను కూల్చివేస్తూ, వారి చెట్లను కూల్చి వేస్తూ, వారి భూములను ఆక్రమిస్తూ-వారిని భయానక పరిస్థితులకు నెడుతున్న అనేకానేక సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి తోడు ఇప్పుడు ఈ గోసంరక్షణ పేరుతో జరుగుతున్న కొత్త హింస మొదలైంది.
ఈ గోరక్షకులు ఆర్.ఎస్.ఎస్ కార్యాన్ని నెరవేర్చటమే కాకుండా పనిలో పనిగా సంపాదనలో కూడా పడ్డారు. ఎవరైనా ముస్లిములు బర్రెలను, ఎద్దులను, ఆవులను దక్షిణాది జిల్లాల నుండి కొనుక్కొని పోవాలంటే-ఆ పేదలు వీళ్లకు రూ. 2000 సమర్పించాలి.
కాశ్మీర్ లోయలో 90 శాతంగా ఉన్న ముస్లిం జనాభాను తగ్గించటం జరగని పని. హిందూ జనాభా లేని కాశ్మీర్ లోయకు జమ్మూను జోడు కుదిర్చి-జమ్మూలో తన ప్రయోగాలు చేయనున్నది అతిశయ హిందూత్వ రాజకీయ పార్టీ అయిన బిజెపి. అందుకుగాను తన చేతి సంస్థలైన బజరంగ్ దళ్, ఆర్.ఎస్.ఎస్ లను ఉపయోగించుకొంటోంది. వీటితో బాటు పాత డోగ్రాల ప్రతినిధి అయిన 'డోగ్రా ఫ్రంట్' లాంటి హిందూత్వ అనుకూల సంస్థలు కూడా ఉన్నాయి.
దాని ఫలితాలను జమ్మూ ముస్లిములు అనుభవిస్తున్నారు. వారిలో ఎక్కువ సంచారజాతి పశుపోషకులు. రోహింగ్యాలను జమ్మూ నుండి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేసిన సంస్థలు కూడా ఇవే.
ఈ సంస్థలకు ఇప్పుడు చేతి నిండా పని పడింది. ఇక్కడ సంచార జీవులైన ముస్లింలను భయపెట్టి వెళ్లగొడితే, లేకపోతే వారి జీవనాధారాన్ని తెగ్గొట్టి ఆర్థికంగా దెబ్బ తీసి హిందువుల ప్రాబల్యం పెంచితే రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒకటి-హిందూ మెజారిటీ ప్రాంతంగా జమ్మూని తయారు చేసి, ముస్లిములను అణచవచ్చు. రెండు-ఈ సంచార జీవుల ఆస్తులను జప్తు చేసుకొని పెట్టుబడిదారులకు అప్పచెప్పవచ్చు.
మనం గత కొద్ది రోజులుగా వింటున్న 'డీలిమిటేషన్, డెమోగ్రాఫిక్ ఛేంజెస్' అనే పదాలకు తాత్పర్యం ఇదే. గోరక్షణ పేరుతో జరుగుతున్న హింసకు కారణం ఇదే.
/ఫేస్‌బుక్ వాల్ నుంచి/
రమాసుందరి










