
ప్రజాశక్తి-చోడవరం
భూముల విలువకు రెక్కల రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాగులు, వంకలు గెడ్డలను కబ్జా చేస్తున్నారు. ఇలా ఓ వ్యక్తి మండలంలోని నరసయ్యపేట వద్ద గోర్జుకు ఇరువైపులా ఉన్న భూములకు అనుసంధానం కోసం ఏకంగా గోర్జును పూడ్చి రోడ్డు వేస్తున్నారు. అయినా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు.
నరసయ్యపేట బ్రిడ్జి వద్ద గోర్జులో నుండి వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. లక్ష్మీపురం ఆయకట్టు పొలాలు, చెరువు నుండి వచ్చే వరద నీరు ఈ గోర్జువాలు ద్వారా శారదా నదిలోకి వెళుతుంది. పూర్వం వరదల సమయంలో నరసయ్యపేట గ్రామంలోకి వరద నీటి ముంపు ఉండేది. పొలాలు కూడా మునిగిపోయేవి. దీంతో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే పొలాలు, గ్రామాలను నీటిముంపు నుండి తప్పించేందుకు వడ్డాది- చోడవరం మెయిన్ రోడ్డుకు నాలుగు కానాలతో బ్రిడ్జిని నిర్మించారు. దీంతో ఈ గోర్జు ద్వారా వరద నీరు ఎటువంటి ఆటంకం లేకుండా శారదా నదిలోకి వెళుతుంది. గతంలో ఓ వ్యాపారి గోర్జు పూడ్చివేతకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు.
ప్రస్తుతం ఓ వ్యక్తి గోర్జుకు ఇరువైపులా ఉన్న భూముల అనుసంధానం కోసం గోర్జువాలును కప్పేసి రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గోర్జులో నీరు పోయేందుకు గొట్టాలు వేసి పూడ్చుతున్నారు. అయితే భవిష్యత్తులో గొట్టాల్లో మట్టి పేరుకుపోయి నీటి ప్రవాహం ఆగిపోతుందని, దీని వల్ల నీరు నిల్వ ఉండిపోయి పొలాలు, నరసయ్యపేట గ్రామం ముంపునకు గురయ్యే ప్రమాదముందని గ్రామస్తులు అంటున్నారు. తక్షణమే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి గోర్జు పూడ్చివేత చర్యలను అరికట్టాలని, గ్రామానికి నీటి ముప్పు లేకుండా కబ్జాను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.