Nov 15,2022 23:11

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: నేడు విలువలు దిగజారుతున్న తరుణంలో గోరా బోధనలు ఎంతో ఉపయోగకరమైనవి, ఆదర్శవంతమైనవని గోరా జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. బెంజిసర్కిల్‌ వద్ద గల నాస్తిక కేంద్రంలో గోరా 120వ జయంతి కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీ రావు మాట్లాడుతూ గోరా ప్రతిపాదించిన వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం ఎంతో విలువైన సిద్దాంతాలన్నారు. నైతిక విలువలు దిగజారితే సమాజంలో అసమానతలు పెరుగుతాయని తెలిపారు. వ్యక్తిలో రీజనింగ్‌ కొరవడితే వ్యక్తి ఔన్నత్యం పతనం అవుతుందన్నారు. ప్రతి వ్యక్తిలోనూ శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, పెంపొందాలన్నారు. శాస్త్రీయ దృక్పథం లేకపోతే మూఢనమ్మకాలు ప్రబలుతాయన్నారు. సామాజిక న్యాయం, సమానత, నైతిక విలువలు, సంఘదృష్టి, మానవత్వం పెంపొందించే విషయంలో గోరా చేసిన కృషి అమోఘమని, గోరా జీవితాచరణ మహాత్మాగాంధీని సైతం ఎంతగానో ఆకట్టుకుందన్నారు. యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందాలని, సామాజిక విలువలతో కూడిన స్పృహ పెంపొందాలని, దానికి గోరాని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తొలుత గోరా విగ్రహానికి దండవేసి, తమ హృదయాంజలి తెలియచేశారు. గోరా కుటీరంలో గోరా స్వీయకథనం లీవ్స్‌ ఫ్రమ్‌ గోరాస్‌ లైఫ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గోరా జయంతి సభలో గాంధేయవాధి మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ద ప్రసాద్‌ మాట్లాడుతూ గోరా జీవితం అందరికీ ఆదర్శనీయమని, నిరాడంబరత, పార్టీ రహిత ప్రజాస్వామ్యం, మానవీయ విలువలతో కూడిన జీవన విషయంలో గోరా బోధనలు ఎంతో ప్రత్యేకతని సంతరించుకుంటాయన్నారు. ఈకార్యక్రమానికి డాక్టర్‌ సమరం అధ్యక్షత వహించగా, డాక్టర్‌ మారు, నియంత, రశ్మి, హరిసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.