భారత్‌లో ఇప్పటికే ప్రజాస్వామ్యం ఎంతో బలహీనపడిందని స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ ఇన్‌స్టిట్యూట్ ఒక నివేదికలో పేర్కొంది. 179 దేశాల జాబితాలో భారత్ 90వ స్థానంలో నిలిచింది. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రతను కబళించడం, భిన్నాభిప్రాయాలను అణచివేయడం వంటి చర్యలకు బిజెపి పాల్పడుతోంది. ముంచుకొస్తున్న ముప్పును ఇప్పటికైనా గ్రహించకపోతే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
ప్రజాస్వామ్యం ద్వారా పొందిన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోంది. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం 'గోప్యత నిర్వీర్యం..అణచివేత..నిఘా..' అనే ఫార్ములాను అనుసరిస్తోంది. ఓ వైపు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూనే.. ప్రజా ఉద్యమాలను అణచి వేస్తోంది. నిర్బంధాలను అమలు చేస్తోంది. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన చట్టసభలు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థతోపాటు మీడియాపై నిఘా పెట్టి.. ఎవరైనా తమకు అనుకూలంగా లేనట్టు తేలితే వారిని ముప్పు తిప్పలు పెడుతోంది. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి పారదర్శకంగా ఉండాల్సిన విధానాల పట్ల గోప్యతను పాటిస్తోంది. 2014లో అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి కాషాయ పార్టీ పాటిస్తున్న విధానాలను చూస్తే ఇది స్పష్టమవుతోంది.
అణచివేత.. నిర్బంధం..
ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం...ఉద్యమకారులను నిరవధికంగా జైళ్లలో పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ఉగ్రవాదం, తీవ్రవాదం పేరుతో అక్రమ కేసులు బనాయించి బెయిల్ రాకుండా 'ఉపా' (యుఎపిఎ) చట్టాన్ని ప్రయోగిస్తోంది. ముస్లిం యువతను టెర్రరిస్టులుగా, దళితులు, ఆదివాసులను మావోయిస్టులుగా ముద్ర వేసి జైళ్లలోకి తోస్తోంది. మేధావుల గొంతు నొక్కడానికి విచారణ జరపకపోవడంతో సుదీర్ఘ కాలంగా జైళ్లలో మగ్గిపోతున్నారు. ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. కేవలం బెయిల్ రాకుండా జైల్లో చాలాకాలం ఉంచడం కోసమే, వాస్తవాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రాజద్రోహం కేసులను నమోదు చేస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో 3762 మంది మీద రాజద్రోహ నేరం మోపితే, నరేంద్రమోడీ పదవీ కాలంలో ఇంతవరకు 7136 మందిని ఈ నేరారోపణతో జైళ్లలో వేశారని... 'ఆర్టికల్ 14' అనే పరిశోధనా సంస్థ తన అధ్యయనంలో పేర్కొంది. 2014 తరువాత పెట్టిన రాజద్రోహం కేసుల్లో 96 శాతం అధికారంలోని రాజకీయ నాయకులను విమర్శించినందుకే పెట్టారని తేల్చింది. అంతేకాకుండా 2016 నుంచి 2019 వరకు మొత్తం 5922 మంది మీద 'ఉపా' కేసులు పెట్టి అరెస్టు చేస్తే, కేవలం 2.2 శాతం కేసులు మాత్రమే రుజువయ్యాయి. ఈ లెక్కలను బట్టి చూస్తే అణచివేత, నిర్బంధం, అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయడమే బిజెపి లక్ష్యంగా కనిపిస్తోంది.
వ్యవస్థలు నిర్వీర్యం
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిజెపి రాజ్యాంగబద్ధ వ్యవస్థలను క్రమక్రమంగా నిర్వీర్యం చేయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాల హక్కులు కాలరాయడం ఎక్కువైంది. కేంద్రీకృత పాలనా వ్యవస్థ వైపు నడవాలన్న ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేలా చట్టం చేసింది. ఒకే దేశం.. ఒకే పన్ను.. అంటూ రాష్ట్రాల ఆదాయ వనరులకు గండికొట్టింది. ఏకపక్షంగా నూతన విద్యావిధానాన్ని రుద్దుతోంది. డిగ్రీ కోర్సుల్లో మార్పులు, సిలబస్ తయారీ, జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ మొదలైన అంశాలన్నిటినీ 'నూతన విద్యా విధానం' ద్వారా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. రాష్ట్రాల హక్కులను కబళించడానికి పదే పదే ప్రయత్నాలు చేస్తోంది.
రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోంది. న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి పెరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా అంతో ఇంతో ప్రజలకు సమాచారం బహిర్గతమయ్యే అవకాశమున్నా...ఆర్టీఐ కమిషనర్ల అధికారాలను గణనీయంగా తగ్గించి, స్వతంత్రంగా వ్యవహరించకుండా చేసింది. దీని ద్వారా ప్రభుత్వ వ్యవహారాలు ప్రజలకు తెలియకుండా నియంత్రించగలిగింది. అవినీతిని వెలికితీసే 'కాగ్' ను నిర్వీర్యం చేసేసింది. నోట్ల రద్దు, రాఫెల్ డీల్ పై సరైన విధంగా స్పందించడంలో 'కాగ్' విఫలమైనట్టు స్పష్టంగా కనిపించింది. ఆర్థికవేత్తలు ఆర్బీఐ చైర్మన్లుగా ఉంటుండగా, చరిత్రలోనే మొదటిసారి 'చరిత్ర' సబ్జెక్టు చదివిన శక్తికాంతదాస్ ను చైర్మన్ గా నియమించి ఆర్బీఐని తన చెప్పుచేతల్లోకి తీసుకు వచ్చేసింది. సీబీఐ అయితే కేంద్ర ప్రభుత్వానికి పంజరంలో చిలకలా మారిపోయింది. పాలకుల రాజకీయావసరాలకు అనుగుణంగా వారి ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడానికి సిబిఐ కి ఇ.డి, ఐ.టి కూడా తోడైంది. ఎన్నికలు జరుగుతున్న తీరును చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ కూడా పాలకుల ఒత్తిడితో స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నట్టు తెలుస్తోంది.
గోప్యత.. నిఘా..
ప్రజలకు, దేశానికి తెలియాల్సిన విషయాల పట్ల గోప్యతను పాటించేలా విధానాలు రూపొందిస్తున్న ప్రభుత్వం...తమకు అనుకూలంగా లేని వారి వ్యక్తిగత గోప్యతను సైతం లెక్క చేయకుండా వారిపై నిఘా పెంచినట్టు స్పష్టం అవుతోంది. దీనికి అనేక ఉదాహరణలను మనం చూడవచ్చు. సొంత పార్టీని ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం చేసుకోవడంతో పాటు విపక్షాలు, ప్రాంతీయ పార్టీలకు విరాళాలు దొరకకుండా చేయడానికి, ఇంకా ఏ వ్యాపారవేత్త ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చేలా ప్రజలకు తెలియకుండా ఉండడానికి ఎలక్టోరల్ బాండ్లను తీసుకువచ్చింది. వీటి ద్వారా పార్టీలకు ఇచ్చే విరాళాల వ్యవస్థలో పారదర్శకత నెలకొనడానికి బదులు అది మరింత సంక్లిష్టంగా తయారైంది. దీని ద్వారా ఎక్కువ లాభం పొందింది బిజెపి యే.. ఎన్నికల బాండ్ల ప్రక్రియ మొదలైన తర్వాత 2018 మార్చి నుంచి 2021 జనవరి వరకు రూ.6534.78 కోట్ల విలువైన 12924 బాండ్లు జారీ అయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు కార్పొరేట్ల నుంచి అందిన నిధుల్లో 95 శాతం ఒక్క బిజెపి ఖాతా లోకే వెళ్లిపోయాయి. 2020లో సైతం 52 శాతం నిధులు బిజెపి కే అందాయి. అంతేకాకుండా పార్టీలకు ప్రభుత్వమే విరాళాలు సమకూర్చాలన్న ప్రతిపాదనను తీసుకురాగా, దీనిని ఎన్నికల కమిషన్ వ్యతిరేకించడంతో ఆగిపోయింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్ జుడిషియల్ దర్యాప్తునకు ఆదేశించినా.. ఇక్కడ మాత్రం సుప్రీం కోర్టు ద్వారా క్లీన్ చిట్ తెచ్చుకొని వాటి వివరాలు ప్రజలకు బహిర్గతం కాకుండా చేసింది. డీల్ మొత్తాన్ని గోప్యంగానే ఉంచింది. అప్పటి జడ్జిపై లైంగిక ఆరోపణలు చేసిన సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని నెంబర్ కూడా పెగాసస్ నిఘాలో ఉండడంతో రాఫెల్ డీల్, కోర్టు తీర్పుల మధ్య బ్లాక్‌మెయిలింగ్, ఇతర ఒప్పందాలు ఏమైనా జరిగాయా అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. కరోనా మరణాల లెక్కలను స్పష్టంగా చెప్పకుండా గోప్యంగా ఉంచింది. ఒత్తిడి రావడంతో కేవలం నాలుగు లక్షల వరకే మరణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. తీసుకున్న రుణాలు వాపస్ రాక బ్యాంకులు క్రమక్రమంగా నిర్వీర్యమవుతున్నా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల పేర్లను ఇప్పటి వరకు బయటపెట్టలేదు. ఇన్‌ఫర్మేషన్ యాక్ట్ కింద డిఫాల్టర్ల వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని 'డిస్‌క్లోజర్ పాలసీ'ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా లోని టాప్ 50 సంస్థలు కట్టాల్సిన రూ. 68,607 కోట్ల మేర రుణాల బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు ఆర్.బి.ఐ వెల్లడించింది. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని చెప్పినా.. ఇది ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కనీసం నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలు సైతం బయటపెట్టలేదు. నోట్ల రద్దు ఎందుకు చేపట్టారో.. దాని వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వివరణ ఇవ్వలేకపోయింది.
ప్రభుత్వ విధానాలు ప్రజలకు తెలియకుండా గోప్యత పాటిస్తున్న కేంద్రం.. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాస్తోంది. ఇటీవల బహిర్గతమైన పెగాసస్ కుంభకోణం దీన్ని స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన 50 వేల మంది ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచారని, అందులో భారత దేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్లు హ్యాక్ చేసినట్టు చెబుతున్నా.. కనీసం విచారణకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. పెగాసస్ స్పై వేర్ జాబితాలో ఉన్న ఫోన్ నెంబర్లలో విపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తోపాటు.. ఎంతో మంది విపక్ష నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, హక్కుల కార్యకర్తల పేర్లు ఉన్నాయి. ప్రభుత్వమే వారిపై నిఘా ఉంచిందని ఆరోపణలు ఉన్నా.. విచారణకు విపక్షాలతోపాటు అందరూ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కానరావడం లేదు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇప్పటికే ప్రజాస్వామ్యం ఎంతో బలహీనపడిందని స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ ఇన్‌స్టిట్యూట్ ఒక నివేదికలో పేర్కొంది. 179 దేశాల జాబితాలో భారత్ 90వ స్థానంలో నిలిచింది. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రతను కబళించడం, భిన్నాభిప్రాయాలను అణచివేయడం వంటి చర్యలకు బిజెపి పాల్పడుతోంది. ముంచుకొస్తున్న ముప్పును ఇప్పటికైనా గ్రహించకపోతే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రజలు చైతన్యవంతులైతేనే రాజ్యాంగ సంస్థలను, జవాబుదారీతనాన్ని, పారదర్శకతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం.
/ వ్యాసకర్త సెల్ : 9618400190 /
మహమ్మద్ ఆరిఫ్











