సన్మానిస్తున్న కలెక్టర్ సుమిత్ కుమార్, అధికారులు
ప్రజాశక్తి-పాడేరు టౌన్: ఐటిడిఎ పిఒగా రోణంకి గోపాలక్రిష్ణ సేవలు మార్గదర్శకమని, గిరిజనాభివృద్ధికి నిబద్ధతతో విధులు నిర్వహించారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కొనియాడారు. ఐటిడిఎ పిఒగా ఇప్పటివరకు పని చేసి సర్వే, సెటిల్ మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అదనపు సంచాలకులు ( ఎడి )గా కమిషనరేట్ లో బదిలీ అయిన రోనంకి గోపాలక్రిష్ణకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం ఐటిడిఎలో వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ, కొత్తగా ఏర్పాటు చేసిన అల్లూరి జిల్లాకు కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు ఆయా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారన్నారు. ఏడాది నుండి చక్కని సహకారం అందించారని పేర్కొన్నారు.
జెసి జె.శివ శ్రీనివాసు మట్లాడుతూ, గోపాలక్రిష్ణ ఐటిడిఎ పిఒగా చెరగని ముద్ర వేసారన్నారు. విద్య, వ్యవసాయం, ఉద్యాన వనం, సంక్షేమ పథకాల అమలులో సమర్ధవంతంగా విధులు నిర్వహించారని చెప్పారు. ఐటిడిఎ పిఒ వి.అభిషేక్ మాట్లాడుతూ రోణంకిగోపాలక్రిష్ణలో అరుదైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రశంసించారు. ఆయన చేపట్టిన విద్య, వైద్యం, మిషన్ కనెక్ట్ పాడేరు, మిషన్ ఏకలవ్య కార్యక్రమాలను కొనసాగిస్తానన్నారు.
రోణంకి గోపాలక్రిష్ణ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో గిరిజనులకు సేవ చేయడం అదృష్టమన్నారు. ఆదివాసీల జీవన విధానం, సంస్కతి, ఆచార వ్యవహారలపై అవగాహన పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ఎపిఒలు విఎస్ ప్రభాకరరావు, ఎం.వేంకటేశ్వరరావు, పరిపాలనాధికారి హేమలత, టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, ఇఇలు డివిఆర్‌ఎం రాజు, కె. వేణుగోపాల్, పీఆర్ ఇఇ కొండయ్య పడాల్ పాల్గొన్నారు.
పెదబయలు:
బదిలీపై వెళుతున్న ప్రాజెక్ట్ అధికారి గోపాలకష్ణను పాడేరులో మండలంలో కీముడుపల్లి ఆదివాసీ గిరిజనుడు గండేరు నిరీక్షణ రావు గురువారం సత్కరించారు.వివిధ అభివృద్ధి పనులకు సహకరించడంతో సత్కరించినట్లు నిరీక్షణ రావు తెలిపారు.










