Nov 20,2022 22:04

ఎపి రైతుసంఘం ఆధ్వర్యాన రైతుల ధర్నా
ప్రజాశక్తి - నిడమర్రు

               రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో అడవికొలను గ్రామంలో రైతుభరోసా కేంద్రం సమీపంలోని ధాన్యం కల్లాల వద్ద రైతులు, కౌలు రైతులు ఆదివారం ధర్నా నిర్వహించారు. గోనె సంచులు ఇవ్వండి.. ధాన్యం కొనండి అంటూ ధాన్యం కల్లాల్లో నినదించారు. ధాన్యం రాశులుగా వేసి 15 రోజులవుతున్నా కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కొత్త విధానం తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా ఆచరణలో ధాన్యం కొనుగోళ్లలో రైతులను అనేక ఇబ్బందులకు గురి చేయడం దారుణమని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే కొనుగోలు చేయకపోవడం వల్ల అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 34 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తామని, కొనుగోలు పరిమితి వల్ల మిగిలిన పంట ఎవరికి అమ్ముకోవాలో అర్థం కావడం లేదని అన్నారు. కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్‌ చేశారు. గోనె సంచుల కొరత తీవ్రంగా ఉందని, రైతులకు సరిపడా గోనె సంచులు అందించాలని కోరారు. వే బ్రిడ్జి కాటా వద్ద ఏ మిల్లుకు ధాన్యాన్ని పంపాలో చెప్పడం ఆలస్యమవుతోందని, దూరప్రాంత మిల్లులకు పంపేందుకు వాహనదారులు ముందుకు రాకపోవడంతో రవాణా సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హమాలీలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రవాణా వాహనం, హమాలీలను ప్రభుత్వమే ఏర్పాటుచేసి కల్లాల నుండి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా నాయకులు పి.కిషోర్‌ రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పమ్మి గోవింద్‌, పైడికొండల ఏసుబాబు, మండా రామకృష్ణ, కొమ్ముల సుబ్బయ్య, కోటిపల్లి రాము, యాళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
ఉంగుటూరు: రైతులు, కౌలు రైతుల నుండి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం, ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో కైకరంలో ఆదివారం ధాన్యం కల్లాల వద్ద ధర్నా నిర్వహించారు. రైతు సంఘం నాయకులు ఉమండలంలోని కైకరం, చేబ్రోలు, నారాయణపురం గ్రామాల్లో పర్యటించి కల్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ కె.అప్పారావు మాట్లాడుతూ వాతావరణ మార్పులతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యుద్దప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు వెంటనే గోనె సంచులు ఇవ్వాలని కోరారు. కొనుగోలు పరిమితి పెంచాలని, తేమశాతం 17 కాకుండా 14గా ఉండాలని చెప్పడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, కర్రి చెన్నారావు, కోటేటి శ్రీనివాసరావు, చింతాడ నాగేశ్వరరావు, గున్ను నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.