Apr 25,2021 15:27

                                                                చికెన్‌

చికెన్‌

కావాల్సిన పదార్థాలు : చికెన్‌ - అరకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి-నాలుగు, టమోటో - ఒకటి, అల్లం-చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు-ఆరు, పసుపు-అర టీస్పూన్‌, గరంమసాలా-టీస్పూన్‌, నూనె-తగినంత, ఉప్పు-రుచికి సరిపడా, మెంతులు-పావు టీస్పూన్‌, కారం-తగినంత, ధనియాలు-టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి-నాలుగు, గోంగూర - రెండు కప్పులు (కట్‌ చేసినది).
తయారుచేసే విధానం :

  • ముందుగా పాన్‌ తీసుకొని అందులో మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేగించాలి.
  • అవి చల్లారిన తరువాత వాటిని మిక్సీలో పొడిచేసి పక్కన పెట్టుకోవాలి.
  • పాన్‌లో నూనెవేసి కాస్త వేడయ్యాక ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక అందులోనే టమోటో ముక్కలు వేసి వేగించాలి.
  • టమోటో మెత్తగా ఉడికిన తరువాత చికెన్‌, గరంమసాలా, కారం, ఉప్పు వేసి కలపాలి. అందులో పావుకప్పు నీళ్లుపోసి, ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో నూనెవేసి వెల్లుల్లి రెబ్బలు, గోంగూర వేసి వేగించాలి.
  • అందులోనే కొంచెం ఉప్పు, గరంమసాలా వేసి కలపాలి. నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర మెత్తగా, పేస్టు మాదిరిగా అవుతుంది.
  • ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న చికెన్‌ వేసి కలపాలి. చిన్న మంటపై కాసేపు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసి, దింపుకోవాలి.

                                                     మెత్తళ్లు.. (చిన్న ఎండు చేపలు)

మెత్తళ్లు.. (చిన్న ఎండు చేపలు)

కావాల్సిన పదార్థాలు : గోంగూర-కట్ట, మెత్తళ్లు-కప్పు, మీడియం సైజు ఉల్లిపాయలు-రెండు (చిన్న ముక్కలుగా కట్‌ చేసు కోవాలి), పచ్చిమిర్చి-రెండు, టమోటో-ఒకటి (పెద్దసైజు), జీలకర్ర- కొంచెం, నూనె- రెండు టేబుల్‌స్పూన్‌లు, ఉప్పు, పసుపు, కారం- రుచికి సరిపడా, కరివేపాకు-రెండు రెమ్మలు, కొత్తిమీర- కొంచెం.
 

తయారుచేసే విధానం :

  • గోంగూరను ఒక పాత్రలోకి తీసుకుని, కొంచెం నీళ్లు పోసి, ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మెదుపుకోవాలి.
  • మెత్తళ్ల తల, తోక భాగం తీసేసి, వేడినీళ్లల్లో ఉప్పు, పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి.
  • స్టౌపై పాన్‌ పెట్టుకోవాలి. నూనెవేసి వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. అది వేగాక కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసి బంగారురంగు వచ్చే వరకూ వేగించాలి. తర్వాత టమోటో ముక్కలను వేసి, ఒక్క నిమిషం వేగనివ్వాలి.
  • అందులోనే మెత్తళ్లను వెయ్యాలి. ఇందులో సరిపడా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. మూతపెట్టి దీన్ని మీడియం మంటలో, పది నిమిషాలు వేయించుకోవాలి.
  • అందులోనే ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూరను వేసి కలిపి, అర నిమిషం మూతపెట్టి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీరను వేసి కలుపుకోవాలి.

                                                               ఎండు రొయ్యలు

 ఎండు రొయ్యలు

కావాల్సిన పదార్థాలు : ఎండురొయ్యలు - కప్పు, గోంగూర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - ఆరు, పసుపు - చిటికెడు, ఉల్లిపాయ-ఒకటి, ఆవాలు-అర టీస్పూన్‌, నూనె - సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు-స్పూన్‌, ధనియాల పొడి - టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, గరం మసాలా-అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.
 

తయారుచేసే విధానం :

  • పాన్‌ తీసుకొని కాస్త నూనెవేసి, వేడయ్యాక పచ్చిమిర్చి, గోంగూర ఆకులు వేసి ఉడికించాలి.
  • గోంగూర ఉడికిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారాక పప్పుగుత్తితో మెదుపుకోవాలి.
  • పాన్‌లో నూనె వేసి, కాస్త వేడయ్యాక ఆవాలు, ఉల్లిపాయ వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర పొడి, ఉప్పు వేయాలి.
  • ఇప్పుడు శుభ్రంచేసి పెట్టుకున్న రొయ్యలు వేసి, కలిపి మరికాసేపు వేగనివ్వాలి.
  • చివరగా ఉడకబెట్టుకున్న గోంగూర వేసి కలపాలి. మరికాసేపు ఉడికించి దించాలి. అన్నంతో లేదా చపాతీతో గోంగూర రొయ్యల కూర తింటే రుచిగా ఉంటుంది.                 

                                                                     మటన్‌

మటన్‌

కావాల్సిన పదార్థాలు : మటన్‌ - అర కిలో, ఉల్లిపాయలు- పావు కిలో, అల్లంవెల్లులి- రెండు టేబుల్‌స్పూన్లు, కారం- టేబుల్‌ స్పూను, పసుపు- టీ స్పూను, కొత్తిమీర- కట్ట, పుల్లగోంగూర కట్టలు- నాలుగు, పచ్చిమిర్చి- ఆరు, నూనె-50 గ్రాములు, ఉప్పు- తగినంత.

  • తయారుచేసే విధానం : కడిగిన మటన్‌ను కుక్కర్‌లో వేయాలి. ఉల్లిముక్కలు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కారం, అల్లంవెల్లుల్లి, ఉప్పు వేసి కలిపి, పక్కన పెట్టుకోవాలి.
  • అరగంట తర్వాత అందులో సుమారు పావులీటరు నీళ్లు పోసి, నాలుగు విజిల్స్‌ రానివ్వాలి.
  • తరువాత పాన్‌లో వేయాలి. అందులోని నీళ్లన్నీ ఆవిరైపోయే వరకూ ఉడికించుకోవాలి.
  • మరో పాన్‌లో గోంగూర ఆకులు వేసి, ఉడికించి మెత్తని ముద్దలా చేసి, ఈ ముద్దను ఉడుకుతున్న మటన్‌లో వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి.
  • ఉప్పు సరిచూసి, దించాక కొత్తిమీర తురుముతో అలంకరించాలి.