
ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : జివిఎంసి 29వ వార్డు పరిధి బీచ్ రోడ్‌లోని గోకుల పార్కును సుమారు రూ.78.61 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వార్డ్ కార్పొరేటర్ ఉరుకుటి నారాయణతో కలిసి మేయర్ గొలగాని హరివెంకటకుమారి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరానికి వచ్చే సందర్శకులు, పర్యాటకులకు ఆహ్లాదం కల్పించేందుకు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఆర్‌కె బీచ్ వద్ద గోకుల్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఎమ్మెల్యే గణేష్‌కుమార్ మాట్లాడుతూ, పరిపాలన రాజధాని అవుతున్న నేపథ్యంలో విశాఖ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి కార్యనిర్వాహక ఇంజినీరు సత్యనారాయణ, ఇతర అధికారులు వైసిపి నాయకులు పాల్గొన్నారు.