ఉద్యానవన శాఖ డీడీ వద్ద ఆయిల్‌పామ్ రైతుల ఆవేదన
కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంలో స్పందించిన అధికారులు
న్యాయం చేస్తామని హామీ
నకిలీ మొక్కలతో మోసపోయామని ఆందోళన
ప్రజాశక్తి - చింతలపూడి
గోద్రెజ్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన మొక్కలు నాటి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఉద్యానవన శాఖ డీడీ పాండురంగన్ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ గోడును వెళ్లబోసుకున్నారు. తమను ఆదుకోవాలంటూ విజయవాడలోని ఉద్యానవనశాఖ కమిషనరేట్‌లో ఏడాది క్రితం రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ నిమిత్తం బుధవారం చింతలపూడి పట్టణంలో ఉద్యానవనశాఖ కార్యాలయం వద్ద ఆయిల్‌పామ్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో గోద్రేజ్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ యాజమన్యం తమకు ఆయిల్‌పామ్ మొక్కలు ఇచ్చారని, మొక్కలు ఏపుగా పెరిగినప్పటికీ దిగుబడి మాత్రం రావడం లేదని అవేదన వ్యక్తం చేశారు. మొక్కల నాణ్యతాలోపం వల్లే దిగుబడి తగ్గిపోయిందన్నారు. మండలంలో సుమారు 60 ఎకరాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉందని వాపోయారు. శాస్త్రవేత్తలు పరిశీలించి మొక్కల లోపం వల్లే దిగుబడి రావడం లేదని నివేదిక ఇచ్చారని, కానీ తమకు ఎలాంటి న్యాయమూ జరగలేదని డీడీ వద్ద వాపోయారు. ఎకరాకు 12 టన్నుల దిగుబడి రావాల్సి ఉందని, కేవలం రెండు టన్నులు మాత్రమే వస్తుందని, ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి అవుతుందని, కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని, ఇందులో ప్రభుత్వానికి కూడా సంబంధం ఉందని, వారితో చర్చించి చేస్తామని చెబుతున్నారని రైతులు మండిపడ్డారు. ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు రాకుండా, ఫీల్డ్ ఆసిస్టెంట్స్ తూతూమంత్రంగా సమావేశం ఏర్పాటు చేయడంతో అధికారులతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా కమిషనర్ చుట్టూ తిరిగితే ఇప్పటికి అధికారులు వచ్చారని, ఈ సమస్య మళ్లీ ఎప్పటికి పరిష్కారం అవుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దిగుబడి రాని మొక్కలు తీయించి కొత్త మొక్కలు వేయిస్తామని, ఖర్చు కూడా భరించేలా, లీగల్‌గా రైతులకు న్యాయం చేసేందుకు కృషిచేస్తామనిఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. దీనికి రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీడీ మాట్లాడుతూ రైతుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.










