ప్రజాశక్తి - నూజివీడు
ఓ ప్రయివేటు పాఠశాలలోని మరుగుదొడ్డి గోడ కూలి ఎల్‌కెజి చదువుతున్న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆగిరిపల్లి మండలం ఈదులుగూడేనికి చెందిన కందుల నీలమణికంఠ(5) నూజివీడు ఎంప్లాయీస్ కాలనీలోని విజ్‌డమ్ ప్రయివేటు పాఠశాలలో ఎల్‌కెజి చదువుతున్నాడు. మధ్యాహ్నం విరామం సమయంలో నీలమణికంఠ టాయిలెట్ కోసం మరుగుదొడ్డివైపు వెళ్లాడు. ఈ తరుణంలో ఒక్కసారిగా గోడ కూలి బాలుడిపై పడింది. ఈ ప్రమాదంలో నీలమణికంఠ అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న మరో ఇద్దరు చిన్నారులు గాయాలపాలయ్యారు. బాలుడి మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న నూజివీడు ఎస్‌ఐ శివనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పాఠశాల నిర్వాహకులు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బంధువులను పరామర్శించి ఓదార్చారు.










