Jul 07,2023 21:58

గాయపడ్డ బాలికను పరామర్శిస్తున్న సర్పంచ్‌ రామస్వామి

పార్వతీపురం రూరల్‌: మండలంలోని రావికోన పంచాయతీ పరిధిలోగల కొత్తవలస గిరిజన గ్రామంలో శుక్రవారం గోడ కూలి ఐదేళ్ల బాలిక సీదరపు లలిత కుడివైపు చెయ్యి విరిగిన సంఘటన జరిగింది. శుక్రవారం వేకువజామున వర్షాలకు నానిపోయి, తడిసిపోయి ఉన్న గోడ అమాంతంగా నిద్రిస్తున్న బాలికపై కూలిపోవడంతో గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా, కుడి చేయి ఎముక విరిగినట్లు ఎక్స్‌రేలో తెలిసింది. ఈ విషయమై రావికోన సర్పంచి కడ్రక రామస్వామి ఆసుపత్రికి వెళ్లి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విషయమై స్థానిక విఆర్‌ఒకు తెలిపినా కనీసం స్పందించలేదని, గిరిజనుల విషయమై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.