
ప్రజాశక్తి - భీమవరం రూరల్
ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీలు జిల్లాలో ప్రారంభించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సోమవారం గోడౌన్‌లో భద్రపర్చిన ఇవిఎంలను కలెక్టర్ పి.ప్రశాంతి, జెసి రామ్‌సుందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్‌స్టేషన్లకు సంబంధించి అవసరమైన ఇవిఎంలను నేటి నుండి సుమారు 40 రోజులపాటు రాజకీయ పార్టీల సమక్షంలో పూర్తిస్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు. సాంకేతిక లోపం ఉన్న వాటిని పక్కనపెట్టి, మిగిలిన వాటిని ఆమోదించే ప్రక్రియ ఇది అని తెలిపారు. బెంగుళూరు నుంచి వచ్చిన బెల్ ఇంజినీర్ల నిర్వహణలో వెబ్ క్యాస్టింగ్, పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. కేంద్రంలోకి సెల్‌ఫోÛన్లు అనుమతించబోమని, గుర్తింపు కార్డులు ఉన్న సిబ్బంది మాత్రమే పనిచేస్తారని, సీసీ కెమెరాల నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇవిఎంల ఎఫ్‌ఎల్‌సి సూపర్‌వైజర్, డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, ఎఫ్‌ఎస్‌సి ఇన్‌ఛార్జి నరసింహారావు, ఆర్‌డిఒ దాసి రాజు పాల్గొన్నారు.