తరుముకొస్తున్న వరద
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
పోలవరం కాపర్ డ్యామ్ వద్ద 32 మీటర్లకు చేరిన నీటిమట్టం
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 26 గ్రామాలకు రాకపోకలు బంద్
గొమ్ముగూడెంలో 253 కుటుంబాలు పునరావాస శిబిరాలకు తరలింపు
భయం గుప్పెట్లో ముంపు మండలాల ప్రజలు
కలెక్టరేట్, ఆర్‌డిఒ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
గోదావరి వరద తరుముకొస్తోంది. రోజురోజుకీ గోదావరి నీటిమట్టం ఉధృతంగా పెరుగుతోంది. బుధవారం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 31 అడుగులు ఉండగా గురువారం సాయంత్రానికి 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 29 మీటర్ల నుంచి 32 మీటర్లకు పెరిగింది. దీన్నిబట్టి వరద ఎంత ఉధృతంగా పెరుగుతుందో స్పష్టమవుతోంది. గతేడాది వరదలతో తీవ్ర ఇబ్బందులు పడిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు మళ్లీ వరద భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఉధృతి కారణంగా వాగులు, వంకలు పొంగి కాజ్‌వేలు నీట మునుగుతున్నాయి. కుక్కునూరు- దాచారం మధ్య గుండేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాజ్‌వేపై వరద నీరు చేరి బెస్తగూడెం, గొమ్ముగూడెం, దాచారం, నెమలిపేట వంటి 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు పొంగడంతో కాజ్‌వేపై వరద నీరు చేరి కొయిదా, కట్కూరు, యడవల్లి, చిగురుమామిడి, కాచారం, కొత్తూరు వంటి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉధృతికి గోదావరికి ఆనుకుని ఉన్న కుక్కునూరు మండలం గొమ్ముగూడెం గ్రామంలోని 253 కుటుంబాలను ముందస్తు చర్యల్లో భాగంగా రావికుంట పునరావాస కాలనీల్లో ఏర్పాటు చేసిన శిబిరానికి గురువారం సాయంత్రం అధికారులు తరలించారు. గతేడాది జులైలో వచ్చిన వరదలకు గొమ్ముగూడెం ప్రజలు దాదాపు మూడు నెలలపాటు పునరావాస శిబిరాల్లోనే ఉన్నారు. మళ్లీ పట్టుమని తొమ్మిది నెలలు గడవకముందే మళ్లీ పునరావాస శిబిరానికి వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలో గురువారం సైతం వర్షం కురుస్తూనే ఉంది. పైనుంచి వరద నీరు గోదావరిలోకి పెద్దఎత్తున చేరుతుండటంతో శుక్రవారం సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 107 గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్, ఆర్‌డిఒ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, క్లోరిన్ టాబ్లెట్లు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు, పాముకాటు నివారణకు సంబంధించిన మందులు, గర్భిణుల తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ దిశానిర్ధేశం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వాసితులకు కష్టాలు
గతేడాది వరదలకు వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు అతలాకుతలమయ్యాయి. కాపర్ డ్యామ్ నిర్మాణంతో వేగంగా వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. అయినప్పటికీ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ఏడాది కాలంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. దీంతో మళ్లీ వరద తరుముకొస్తుండటంతో జనం భయం భయంగా కాలం గడుపుతున్నారు. 2022 అక్టోబర్‌కు 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలకు పరిహారం అందించి తరలిస్తామని సిఎం ఇచ్చిన హామీ సైతం బుట్టదాఖలైంది. నిర్వాసితుల ఇబ్బందులకు ప్రభుత్వమే కారణం. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం నిర్వాసితులను వెంటాడుతోంది.
26 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
భయాందోళనల్లో ముంపు మండలాలు
కుక్కునూరు: నాలుగు రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. వారం రోజుల క్రితం గోదావరిలో నీరు లేకపోవడంతో ఈ ఏడాది గోదావరి వరద తమ గ్రామాలను ముంచెత్తదని మండల ప్రజలు భావించారు. నాలుగు రోజుల్లోనే గోదావరికి భారీగా వరద రావడంతో మండల ప్రజల్లో తీవ్ర అలజడి నెలకొంది. గతేడాది జులైలో గోదావరి వరదలు మండలాన్ని ముంచెత్తి తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఏడాది గడిచినా నేటికీ ప్రభుత్వం నుండి పూర్తిస్థాయిలో వరద నష్ట పరిహారం ఇవ్వకపోవడం, ఆనాటి భయంకర పరిస్థితులు మరువక ముందే మళ్లీ గోదావరి వరద పెరుగుతూ మండలాన్ని చుట్టుముడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. మండలంలోని కుక్కునూరు-దాచారం మధ్య గుండేటి వాగుపై గల కాజ్‌వేను గురువారం వరద ముంచెత్తింది. దీంతో వాగు అవతల వైపు ఉన్న దాచారం, బెస్తగూడెం, గొమ్ముగూడెం, రామచంద్రాపురం, మద్దిగట్ల, నెమలిపేట అరవపల్లి, రామన్నగూడెం, లచ్చిగూడెం, ఊటబోరు, గుండుగూడెం, గుండంబోరు, రావుకుంట, బుడుగు వంటి 14 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గొమ్ముగూడెం గ్రామ సమీపంలోకి వరద నీరు చేరుతుండటంతో ముందుగానే స్థానిక తహశీల్దార్ ప్రమద్వర, సిఐ సత్యనారాయణ తమ సిబ్బందితో చేరుకుని గ్రామంలోని 253 కుటుంబాలను ఖాళీ చేయించి రావికుంట పునరావాస శిబిరానికి తరలిస్తున్నారు.
వేలేరుపాడు: గోదావరి వరద ఉధృతికి గురువారం మండలంలోని బోళ్లపల్లి-యడవల్లి మధ్య ఎద్దువాగు వంతెన పైకి వరదనీరు చేరడంతో కోయిదా, కట్కూరు, ఎడవల్లి, కొత్తూరు, చిగురుమామిడి, సిద్ధారం, కాసారం వంటి 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వేలేరుపాడు మండలంలోని రుద్రమ్మకోట గ్రామాన్ని జెసి లావణ్యవేణి సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామస్తులు అప్రమత్తంగాఉండాలని సూచించారు. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, వారికి అవసరమైన రేషన్, ఇతర నిత్యావసర సరుకులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ ఝాన్సీరాణి, వేలేరుపాడు తహశీల్దార్ తదితరులు ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టు నుండి 4,49,352 క్యూసెక్కుల నీరు విడుదల
పోలవరం: పోలవరంలో గోదావరి నీటిమట్టం అనూహ్యరీతిలో పెరిగింది. పోలవరం ప్రాజెక్టుకు అదనంగా వస్తున్న 4,49,352 క్యూసెక్కుల నీటిని జల వనరుల శాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు. పోలవరంలో బుధవారం సాయంత్రానికి 17.897 మీటర్లుగా ఉన్న నీటిమట్టం గురువారం ఉదయానికి 21.277 మీటర్లకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 31.300 మీటర్లు, స్పిల్‌వే దిగువన 22.600 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఎగువ కాపర్ డ్యామ్‌కు ఎగువన 31.900 మీటర్ల నీటిమట్టం, దిగువ కాపర్ డ్యామ్ వద్ద 21.970 మీటర్ల నీటిమట్టం నమోదైంది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు స్పిల్‌వే రేడియల్ గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి ఉంచారు.
కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు
ఏలూరు కలెక్టరేట్: 18002331877
జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ కార్యాలయం: 9553220254
కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం: 7013128597, 9848590546
వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం: 6309254781










