Jul 31,2023 21:35

ముంపులోనే రహదారులు
15 రోజులుగా 16 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
వసతుల్లేక పునరావాస కాలనీ ప్రజల అవస్థలు
భోజనం, తాగునీరు కూడా లేని దుస్థితి
ప్రజాశక్తి - కుక్కనూరు

వారం రోజులుగా ముంపు మండలాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గోదావరికి వరద ఉధృతి సోమవారం తగ్గుముఖం పట్టింది. భద్రాచలంలో 56 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం సోమవారానికి 41 అడుగులకు తగ్గడంతో ముంపు మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరదల కారణంగా వేలేరు-బూర్గంపాడు, చీరవల్లి-వింజరం మధ్య ప్రధాన రహదారిపై వరద నీరు చేరి ఐదు రోజులుగా నిలిచిన రాకపోకలు ప్రస్తుతం యథావిధిగా సాగుతున్నాయి. అలాగే సీతారామనగరం-శ్రీధర మధ్య రహదారిపై వరద తగ్గి రాకపోకలు సాగుతున్నాయి. 15 రోజులుగా ముత్యాలంపాడు-వింజరం మధ్య గల పాలవాగు కాజ్‌వే, కుకునూరు-దాచారం మధ్య గుండేటి వాగుపై కాజ్‌వే ముంపులోనే ఉండటంతో16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీరంతా మండల కేంద్రానికి రావాలంటే 15 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. గొమ్ముగూడెం, కుక్కునూరులోని గణేష్‌ నగర్‌, రామాలయం కాలనీ, రజక బజారు, దాసరి బజార్‌ కాలనీల్లోని ఇళ్లల్లోకి చేరిన వరదనీరు తగ్గడంతో ముంపు నుండి బయటపడ్డాయి. ఇళ్లల్లో అడుగు మందం ఒండ్రు పేరుకుపోయి చెత్తాచెదారంతో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. మళ్లీ గోదావరి వచ్చే ప్రమాదం ఉండటం ఆగస్టు చివరి వరకూ వరద గండం పొంచి ఉండటంతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. గొమ్ముగూడెం గ్రామానికి చెందిన 253 కుటుంబాలు, బెస్తగూడెం గ్రామానికి చెందిన 150 కుటుంబాలు, రేపాకగొమ్ము గ్రామానికి చెందిన 203 కుటుంబాలు తలదాచుకున్న రావికుంట, కుక్కునూరు 'ఎ' బ్లాక్‌కు చెందిన 500 కుటుంబాలు తలదాచుకున్న కివ్వాక పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వరద బాధితులకు పని లేకపోవడం, ఓ వైపు వర్షాలు కురుస్తుండటంతో ఉన్న డబ్బులు అయిపోవడంతో ఆ నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న తమకు తిండైనా పెట్టండి లేదా పనైనా చూపాలని వేడుకుంటున్నారు.
12.97 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల
పోలవరం : పోలవరం వద్ద గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న12,97,350 లక్షల క్యూసెక్కుల అదనపు వరద జలాలను విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఇఇ పి.వెంకటరమణ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 33.540 మీటర్ల నీటిమట్టం, దిగువన 25.250 మీటర్లు, ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద 35.480 మీటర్లు, దిగువన 24.700 మీటర్లు నమోదైంది. పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం 24.278 మీటర్లుగా ఉంది.