ప్రజాశక్తి - కుక్కునూరు
నాలుగు రోజులుగా వరద పోటెత్తి పెరుగుతూ వచ్చిన గోదావరి శనివారం తగ్గుముఖం పట్టింది. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. భద్రాచలంలోగోదావరి నీటిమట్టం 39.7 అడుగులకు తగ్గినా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ప్రాజెక్టులలో ఉన్న నీటిని దిగువకు వదులుతుండటంతో మళ్లీ వరద పెరుగుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించడంతో ముంపు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా కుక్కునూరు-దాచారం మధ్య కాజ్‌వేను వరద ముంచెత్తడంతో 14 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గొమ్ముగూడేనికి చెందిన 253 కుటుంబాలు, వేలేరుపాడు మండలానికి చెందిన 180 కుటుంబాలను రావికుంట పునరావాస కేంద్రానికి తరలించి వారికి అవసరమైన నిత్యావసర సరుకులిచ్చి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తహశీల్దార్ ప్రమద్వర తెలిపారు.
48 వైద్య శిబిరాల నిర్వహణ
అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భారత్
వేలేరుపాడు: ముంపు గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడానికి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముంపు ప్రాంతాల్లో 48 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. శనివారం ఆయన ఆర్‌డిఒ ఝాన్సీరాణితో కలసి కోయిదా పిహెచ్‌సిని పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. సివిల్ సప్లయీస్ స్టాక్ పాయింట్‌ను తనిఖీ చేశారు. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నార్లవరం, తూర్పుమెట్ట, చిగురుమామిడి, కట్కూరు, టేకూరు, కాసారం గ్రామాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ వైద్య శిబిరాల్లో అన్నివేళలా డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వైద్య సేవలు అందించడానికి 108 వాహనాలు సిద్ధం చేశామని తెలిపారు. 27 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు మండలంలోని ఎర్రబోరుకు చెందిన గర్భిణి గొండ్ల మంగతాయా రును వరద కారణంగా వేలేరుపాడు పిహెచ్‌సికి తరలించగా శుక్రవారం ఆరోగ్యవంతమైన పాపను ప్రసవించినట్లు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నుండి 6,44,857 క్యూసెక్కుల నీరు విడుదల
పోలవరం: పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. పోలవరం ప్రాజెక్టు నుండి 6,44,857 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఇఇ పి.వెంకటరమణ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 32.040 మీటర్ల నీటిమట్టం, దిగువన 23.540 మీటర్ల నీటిమట్టం, ఎగువ కాపర్ డ్యామ్ వద్ద 32.790 మీటర్లు, దిగువ కాపర్ డ్యామ్ వద్ద 23.140 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పోలవరంలో గోదావరి నీటిమట్టం 22.577 మీటర్లకు తగ్గింది.
సెల్‌టవర్లకు జనరేటర్లు సిద్ధం
ఎపిఇపిడిసిఎల్ ఎస్‌ఇ సాల్మన్‌రాజ్
కుక్కునూరు: గోదావరి వరదల దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు సెల్‌టవర్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు జనరేటర్లు సిద్ధం చేశామని ఎపిఇపిడిసిఎల్ ఎస్‌ఇ సాల్మన్‌రాజ్ తెలిపారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో విద్యుత్ సరఫరా అన్ని సెల్ టవర్లకు ప్రస్తుతం అందుబాటులో ఉందన్నారు. ముందు జాగ్రత్తచర్యగా ప్రధాన గ్రామాలైన కొయిదా, టేకూరు గ్రామాల్లో రెండు 7.5 కెవి జనరేటర్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కొయిదా, కుక్కునూరు ఫీడర్లకు ప్రత్యామ్నాయంగా మరో విద్యుత్ లైనుకు ప్రతిపాదించామని, వాటి పనులు ప్రారంభించామని తెలిపారు.
పునరావాసం కల్పించకే ప్రజలకు పాట్లు : సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి
ఏలూరు: ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం పూర్తిగా కల్పించనందువల్లే గోదావరి వరదలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి విమర్శించారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం, పరిహారాన్ని పూర్తిగా చెల్లించి అక్కడి ప్రజలను పునరావాస కాలనీలకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరికి వరద వచ్చినప్పుడల్లా పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు ఇంత వరకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని, ఇప్పుడు మళ్లీ వరదలతో ముంపు గ్రామాల ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన 6941 కుటుంబాలకు నష్టపరిహారం అందాల్సి ఉందని తెలిపారు. జిల్లా కలెక్టరే గత సంవత్సరం వరద నష్టపరిహారం ఒక్క వేలేరుపాడు మండలంలోనే ఇంకా వెయ్యి మందికిపైగా ఇవ్వాల్సి ఉందని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కుక్కునూరులో కూడా వందల మందికి బకాయిలున్నాయని పేర్కొన్నారు. గ్రామాలను ఖాళీ చేయించేటప్పుడు సామగ్రి తరలింపు విషయంలో ప్రభుత్వమే వాహనాలు ఏర్పాటు చేసి నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని, లేదా తరలింపునకు అయ్యే రవాణా ఖర్చులైనా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం వరదల వల్ల ఇప్పటికే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కలిపి దాదాపుగా 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామాల ప్రజల మౌలిక అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వారు కొండలు, గుట్టలపై నివాసం ఉంటున్నారని, అందుకు వారికి గుడారాలు ఏర్పాటు చేయాలని, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, సరిపడా తాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు. గత సంవత్సరం వరదల సందర్భంగా రేషన్ కార్డుపై ఒక మంచినీటి ప్యాకెట్ ఇచ్చారని, ఇది అమానుషమని, ఈ సంవత్సరమైనా వరద బాధితులకు సరిపడా తాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు. ముంపు గ్రామాల ప్రజలకు చట్టబద్ధంగా అందించాల్సిన నష్టపరిహారాన్ని పూర్తిస్థాయిలో అందించి, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి నిర్వాసితులను తరలించడం ద్వారానే గోదావరి వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య పరిష్కారానికి పూనుకోవాలని డిమాండ్ చేశారు.










