ప్రజాశక్తి -సీలేరు
ఎపి జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ పరిధి జలాశయాలను గోదావరి రిసోర్స్ రివర్ మేనేజ్మెంట్ మెంబర్ సెక్రెటరీ ఆర్.అజిగేసన్, సీనియర్ మెంబర్ రంగరాజన్‌తో కూడిన బృందం బుధవారం పర్యటించి అధ్యయనం చేసింది. ముందుగా మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి వివరాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జోలాపుట్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఆంధ్ర ఒరిస్సా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం వద్దకు చేరుకొని ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమే పలు అంశాలపై చర్చించారు. గత ఒప్పందాల ప్రకారం నీటి నిల్వలు, పంపకాలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. సీలేరు సమీపంలో ఉన్న గుంటవాడ రిజర్వాయర్, రెగ్యులేటరీ డ్యామ్‌కు చేరుకొని డ్యాముల పనితీరు తదితర అంశాలపై సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ బి. శ్రీధర్, ఎస్‌ఈ కేకేవి. ప్రశాంత్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. రెగ్యులేటరీ డ్యాం గేట్లు తుప్పు పట్టకుండా ఎప్పటి కప్పుడు పరిశుభ్రం చేయాలని సూచించారు. సీలేరులో నూతనంగా నెలకొల్పునున్న పంపు స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణపు ప్రదేశాలను, దానికి సంబంధించిన వివరాలు ఏపీ జెన్కో అధికారులు వివరించారు. స్థానిక జల విద్యుత్ కేంద్రానికి నీరుందించే ఇంటెక్ డ్యాం పనితీరు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాచ్ ఖండ్ నుంచి డొంకరాయి వరకు రిజర్వాయర్లు పనితీరు, ఆంధ్ర ఒరిస్సా ఉమ్మడి నిర్వహణలో ఉన్న నదిజలాలు పంపకాలు గత ఒప్పందాల ప్రకారంగా జరుగుతున్నాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపట్టామని తెలిపారు. అనంతరం పోల్లూరు జల విద్యుత్ కేంద్రానికి చేరుకొని, రెండో దశ నూతనంగా నిర్మాణం చేపట్టనున్న ఐదు ఆరు యూనిట్లు ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీరు బి. శ్రీధర్, ఎస్‌ఈ సివిల్ కేకేవి. ప్రశాంత్ కుమార్, ఈఈలు బాబురావు, బాలకృష్ణ, ఏడిఈ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










