Jul 28,2021 06:14

     విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎప్పుడు తీసుకుంటామో కూడా తెలియదని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడం ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టం లోని అంశం. ఈ చట్టం చేసి నేటికి ఏడేళ్లయినా దీనికి అతీ గతీ లేదు. ప్రత్యేక అధికారి నియామకం, డి.పి.ఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు) తయారు చేయడం, ఆ అధికారి బదిలీపై వెళ్లిపోవడం జరిగాయి. కానీ, జోన్‌ మాత్రం ఏర్పాటు కాలేదు.
      విస్తరిస్తున్న విశాఖ నగర రవాణా అవసరాలరీత్యా మెట్రో రైల్‌ ఏర్పాటు చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యతని విభజన చట్టం సెక్షన్‌ 93, షెడ్యూల్‌ 13లో పేర్కొన్నారు. కానీ, చట్టంలో ఇలాంటి అంశం ఒకటుందనే విషయాన్నే కేంద్ర పెద్దలు మరిచారు.
అదే చట్టంలో అనేక విద్యాలయాలు, వివిధ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వీటిలో భాగంగా పెట్రోలియం యూనివర్సిటీ, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ వంటివి ఉత్తరాంధ్రలో ఏర్పాటు జరగాలి. వీటిలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులే ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలిన రెండింటి నిర్మాణం అరకొర నిధులతో నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పటికి పూర్తి అవుతాయో కూడా తెలియదు.
     ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని అదే చట్టం సెక్షన్‌ 46(3)లో పేర్కొన్నారు. దీన్నీ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఒక ప్రహసనంలా మార్చివేసింది. ఇచ్చిందే తక్కువయితే, దాన్ని కూడా వెనక్కి తీసేసుకుంది. ఇవన్నీ ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడడమే కాక, అత్యవసరం కూడా. వీటన్నింటికి పరాకాష్టంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటును ఇప్పుడు ఏకంగా అమ్మకానికే పెట్టింది. 'ఇచ్చిందేమీ లేదు సరికదా, వున్న దాన్నే అమ్మేస్తారా...?' అని కార్మికులు, రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారు.
రాష్ట్రంలో జాబ్‌ కేలండరు విడుదలకై పెద్ద ఎత్తున యువత పోరాడుతున్నారు. ఉత్తరాంధ్ర యువత కూడా ఇందులో ముందు భాగాన వుంది. విజయనగరంలో 1000 మందితో పెద్ద ప్రదర్శన జరిగింది. రాష్ట్ర ప్రదర్శనకు పోరాట కమిటీ పిలుపునిచ్చిన సందర్భంగా మూడు జిల్లాల్లోనూ పోలీసులు విద్యార్ధి, యువజన సంఘాల నాయకులను పెద్ద ఎత్తున నిర్బంధించి, అరెస్టులకు పూనుకున్నారు. అక్రమ కేసులు కూడా బనాయించారు. ఇలాంటి అంశాలపై ప్రజా ప్రతినిధులు స్పందించడం ఎక్కడైనా సహజంగా జరుగుతుంటుంది.
      అదేం విచిత్రమో కానీ, వీటిలో ఏ ఒక్క అంశంపైనా స్పందించని ఉత్తరాంధ్ర బిజెపి కి చెందిన ప్రజాప్రతినిధి, ఇప్పుడు ఒక గోవు చనిపోయిందని గగ్గోలు పెడుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం లోకి ప్రవేశించిన ఒక ఆవు మరణించడంపై యూనివర్సిటీ అధికారులు విచారణ కమిటీని వేశారు. కానీ ఈయనకు మాత్రం గో మాత మరణం మహా బాధ కలిగించింది. దాని దహన ప్రదేశానికి వెళ్ళి ఘనంగా నివాళులర్పించారు. అది కూడా సరిపోక దాని మరణానికి కారణమైన అధికారుల సంగతి తేల్చవలసిందేనని ప్రకటించారు. కాకతాళీయంగా అదే సమయంలో ఉద్యోగ భద్రత కోసం ఉద్యమిస్తున్న విశాఖ ఆటోనగర్‌ కు చెందిన ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈయనకు అది కనపడలేదు. ఎందుకంటే వీరికి మనిషి ప్రాణం కంటే రాజకీయాలే ముఖ్యం కనుక.
      సాధారణంగా తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే స్పందించడం ఆ ప్రాంత ప్రజా ప్రతినిధుల కనీస విధి. అయితే వీరి దారే వేరు. తనకు ఓట్లేసి గెలిపించిన పట్టభద్రుల కోసం, అభివృద్ధి కోసం కనీసమైన ప్రయత్నం కూడా చేయకపోవడం బిజెపి నేతల లక్షణంగా కనిపిస్తోంది. ప్రజలలో సహజంగా ఉండే మత విశ్వాసాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రజలను ఈ అంశాలపై రెచ్చగొట్టి, వారిని పక్కదారి పట్టించి, తమ కార్పొరేట్‌ అనుకూల విధానాలను కొనసాగించడం ఆ పార్టీ అధినాయకత్వానికి అలవాటు. అదే తాను లోని ముక్కలైన వీరు ఇక్కడ కూడా ఇలాంటి ఘాతుకానికే పాల్పడుతున్నారు. దీనికి జనసేన ప్రతినిధులు వంత పాడటం దుర్మార్గం. రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేస్తున్న బిజెపి కుయుక్తులను, వీరి మత విద్వేష రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే వున్నారు.
 

- కె.లోకనాథం,
సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి.