Oct 23,2022 23:28

చికిత్స పొందుతున్న శ్రీను

ప్రజాశక్తి - ఆరిలోవ : రాత్రి నిద్రించే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మరోకరి గొంతును కోసి పరారైన ఘటన శనివారం రాత్రి ఆదర్శనగర్‌లో చోటుచేసుకుంది. బాధితుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదర్శనగర్‌ అరుణోదయ స్కూలు వద్ద సామిరెడ్డి శ్రీను(45) రమణమ్మ దంపతులు తమ కుటుంబ సభ్యులతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి సామిరెడ్డి శ్రీను ఇంటి వరండాలో ఉన్న సెల్ఫ్‌పై పడుకున్నాడు. శ్రీను భార్య రమణమ్మ, కుమారుడు చందు ఇంట్లో పడుకున్నారు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నిద్రిస్తున్న శ్రీను గొంతు కోసి పరారయ్యాడు. గొంతుపై తీవ్ర గాయమై, రక్తస్రావంతో ఇంటి తలుపులు కొట్టి భార్య, కుమారుని పిలవగా భార్య, కుమారులు లేచి చూసే సరికి శ్రీను గొంతు నుంచి తీవ్ర రక్త స్రావం అవుతుంది. వెంటనే శ్రీనును దగ్గరలో ఉన్న విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి కెజిహెచ్‌కు తరలించారు. బాధితుడు భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.