ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులోని అపార్ట్‌మెంట్ల వాసులు నీటికి కటకటలాడుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో నీటి కష్టాలు పెరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జిఎంసి) పరిధిలో పలుచోట్ల అనధికారికంగా బోర్లు వేస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల 300 నుంచి 400 అడుగులపైగా లోతుకు బోర్లు వేశారు.
అధికారుల సమాచారం ప్రకారం జిఎంసి పరిధిలో 4,500 అపార్ట్‌మెంట్లున్నాయి. వీటిలో దాదాపుగా 3 నుండి 4లక్షల వరకు ప్రజలు నివసిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు నగర జనాభా 9.25 లక్షలకు చేరిందని అధికారుల అంచనా. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు బృందావన్ గార్డెన్సు, లక్ష్మీపురం, బ్రాడీపేట, అరండల్‌పేట, నల్లపాడు, గోరంట్ల, నగరాలు, అమరావతి రోడ్డు, పలకలూరు రోడ్డు, ఏటి అగ్రహారం, గుజ్జనగుండ్ల, చంద్రమౌళినగర్, విద్యానగర్, వికాస్ నగర్‌లలో వందలాది అపార్ట్‌మెంట్లు వెలిశాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి లభ్యత రోజురోజుకు పెరగాల్సింది పోయి తగ్గిపోతోంది. నగరపాలక సంస్థ పైపులైన్లు లీకులు ఏర్పడి తరచూ మరమ్మతులు జరుగుతున్నాయి. రోజుకు గంటకు పైగా నీటి సరఫరా జరగాల్సిన ప్రాంతాల్లో కూడా కుళాయిలకు 10 నిమిషాలు కూడా నీరు రాని పరిస్థితినెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోజు మార్చి రోజు నీరు వస్తున్న ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. ఒకరోజు 30 నిమిషాలు సాఫీగా నీరు వస్తే రెండు రోజు సరిగా నీరు రావడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన కొరవడింది. విద్యానగర్, చంద్రమౌళినగర్, బ్రాడీపేట, నగరాలు, గుజ్జనగుండ్ల, విద్యానగర్, అరండల్‌పేట తదితర ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గిపోయింది.
కార్పొరేషన్ పరిధిలో 42 రిజర్వాయర్లు ఉన్నా తాగు నీరు చాలా చోట్ల అందరికి అందుబాటులోకి రాలేదు. కార్పొరేషన్ సరఫరా చేసే నీరు ప్రజల అవసరాలను తీర్చలేకోపోతున్నాయి. విలీన గ్రామాల్లో సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. గోరంట్ల కొండపై నిర్మిస్తున్న రిజర్వాయర్‌కు కనెక్షన్లు ఇవ్వడం ఇంకా పూర్తి కాలేదు. బోర్లున్నా నీరు అడుగంటి పోయిన వారు ట్యాంకర్ల ద్వారా నీటిని అపార్టుమెంట్‌లలోని సంప్‌లకు తెప్పించుకుని అక్కడి నుంచి ట్యాంకుకు ఎక్కించుకుంటున్నారు. అపార్టుమెంట్ వాసులు నెలకు ట్యాంకర్ నీటి కోసం రూ.15 నుండి 20 వేలకు పైగా చెల్లిస్తున్నారు. ట్యాంకర్ నీటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారు. తాగునీటి కోసం ప్రత్యేకంగా మినరల్ వాటర్ ముసుగులో 20 లీటర్ల క్యాన్ వాటర్‌కు ఒక్కో కుటుంబం నెలకు రూ.750నుంచి రూ.900 వరకు వెచ్చిస్తున్నారు. కార్పొరేషన్‌కు నీటి పన్ను చెల్లిస్తున్నా సరఫరా సక్రమంగా ఉండటం లేదు.










