ప్రజాశక్తి- సీలేరు
జీకే వీధి మండలం, దుప్పిలివాడ పంచాయతీ బందవీధికి చెందిన గొల్లూరు శైలుకు వికలాంగు పెన్షన్ మంజూరు చేయాలని ప్రజాశక్తి ప్రచురించిన వార్తకు స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ స్పందించారు. శైలుకు కాలు చచ్చుబడిపోయి నడవలేని పరిస్థితి నెలకొన్నా, అధికారులు వికలాంగు పింఛను మంజూరు చేయకపోవడంపై శైలు తల్లిదండ్రుల గోడును ప్రజాశక్తి వార్తగా ప్రచురించింది. దీనిపై స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ స్పందించి సచివాలయ మహిళా పోలీసు రేవతిని వారి ఇంటికి వెళ్లి గొల్లూరి శైలు స్థితిగతులు స్వయంగా తెలుసుకోవాలని ఆదేశించారు. దీంతో రేవతి వారింటికి వెళ్లి శైలుకు ఎందుకు వికలాంగు పెన్షన్ రాలేదని ఆరా తీసి, ఆధార్ కార్డును పరిశీలించారు. అయితే శైలు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్‌కు లింక్ కాకపోవడంతో సదరం సర్టిఫికెట్ పొందలేకపోయిందని తేలింది. శైలు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్‌ఐ రామకృష్ణ దుప్పిలివాడ పంచాయతీ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రామకృష్ణ ప్రజాశక్తితో మాట్లాడుతూ శైలుకు తొందరిలోనే సదరం సర్టిఫికెట్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.










