మృతులు ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.25 లక్షలు పరిహారం అందించాలి : సిపిఎం జిల్లా కమిటీ
ప్రజాశక్తి - కాజులూరు
కాజులూరు మండలం గొల్లపాలెంలో ఇద్దరు దళిత యువకులు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజ నిజాలు బయటకు తీయాలని సిపిఎం, జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం ప్రజా సంఘాల నాయకులుతో కలిసి జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, గొల్లపాలెంలో మతి చెందిన ఆర్యవటం గ్రామానికి చెందిన తాతపూడి మహేష్, శీల గ్రామానికి చెందిన నేరేడుపల్లి శివకుమార్ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించారు, ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మాట్లాడుతూ తాతపూడి మహేష్ డ్రైవర్‌గా పని చేస్తూ ఆ పేటలో చుట్టుపక్కల వారికి సహకారంగా ఉంటూ యువతకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి ఆసరాగా ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్త రాజశేఖర్ మాట్లాడుతూ మృతుడి తాతపూడి మహేష్ తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని వారికి చేదోడు వాదోడుగా ఉంటున్న కుమారుడు అర్థరాంతరంగా చనిపోవడం ఆ కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు గురి చేస్తున్నాయన్నారు. అలాగే మృతుడు నేరేడుపల్లి శివ కుమార్ కుటుంబ సభ్యులు శీల గ్రామానికి చెందిన పేద కుటుంబం కూడా డ్రైవింగ్ వత్తి చేసుకునే శివకుమార్ సంపాదనపై ఆధారపడ్డారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గొల్లపాలెంలో జరిగిన దళిత యువకులు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించి ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం, రెండు ఎకరాల భూమి, ఇళ్ల స్థలం ఇచ్చి, ఇళ్లు కట్టించాలని వారు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన వారిలో కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ కె సింహాచలం, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్ష కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్ శ్రీనివాస్ ఉన్నారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
మంగళవారం బయో డీజిల్ ట్యాంక్‌లోకి దిగిన ఇద్దరు యువకులు మృతిచెందిన విషయం విదితమే. ఈ ఘటనపై మృతుల తండ్రుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు గొల్లపాలెం ఎస్‌ఐ తులసీరామ్ తెలిపారు. బుధవారం గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐ తులసీరామ్ విలేకరులతో మాట్లాడుతూ గొల్లపాలెం శివారులో మంగళవారం జరిగిన ఘటనలో తాతపూడి మహేష్, నేరేడుపల్లి శివకుమార్ మృతి చెందగా వారి తండ్రులు అప్పారావు, సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
గొల్లపాలెం మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న సిపిఎం జిల్లా నాయకులు










