Aug 19,2023 23:15

వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు
ప్రజాశక్తి - పాలకోడేరు

          గొల్లలకోడేరు పంచాయతీ ఆరో వార్డు ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిందని, ప్రజలు ఇచ్చిన విజయం పంచాయతీ అరాచక పాలనకు చరమగీతం అని డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహారాజు అన్నారు. పార్టీలకు అతీతంగా వైసిపి గ్రామ అధ్యక్షులు చేకూరి రాజా నరేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో ఆరో వార్డు అభ్యర్థి సంబలదీవీ నాగమణి విజయం సాధించడం పట్ల పివిఎల్‌ హర్షం వ్యక్తం చేసి గొల్లలకోడేరులో నిర్వహించిన అభినందన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అభ్యర్థిని ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. అభ్యర్థి నాగమణి విజయానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. కొంతమంది గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పారు. పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులంతా కలిసి అటువంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వైసిపి గ్రామ అధ్యక్షులు రాజా నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ పంచాయతీలో జరుగుతున్న అవినీతికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా విజయం సాధించామన్నారు. కేవలం కొంతమంది వ్యక్తులు వల్ల గ్రామ అభివృద్ధి వెనుక పడిందని, ఈ విజయంతో వారు మార్పు చెందాలని, లేకపోతే రానున్నరోజుల్లో వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అభ్యర్థి నాగమణి గెలుపునకు పార్టీలకతీతంగా సహకరించిన ప్రతిఒక్కరికి రుణపడి ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి భూపతి రాజు సత్యనారాయణరాజు (చంటిరాజు), సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్షులు భూపతి రాజు వంశీకృష్ణమరాజు, ఎంపిటిసి సభ్యులు కరోతి వెంకటలక్ష్మి, నాయకులు పెనుమత్స శ్రీనివాసరాజు, జివి.నరసింహరావు, సంబలదీవి వెంకటేశ్వరరావు, కుక్కల బాబురావు, వీరవల్లి శ్రీను గోపాల్‌రావు, శ్రీనివాస్‌, సాల్మన్‌రాజు, కరోతి సత్యనారాయణ పాల్గొన్నారు.
టిడిపికి అభినందనలు
ఆరో వార్డు అభ్యర్థి నాగమణి గెలుపునకు కృషి చేసిన టిడిపి గ్రామ అధ్యక్షులు కమ్మిలి రాంబాబు, మాజీ సర్పంచి గాదిరాజు సూర్యనారాయణరాజును, టిడిపి మండల అధ్యక్షులు దెందుకూరి ఠాగూర్‌కోటేశ్వరరాజు అభినందించారు. గొల్లల కోడేరులో పంచాయతీ వద్ద పుష్పగుచ్ఛం అందించి ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు టిడిపి నాయకులు నేతల గోపి, కాజా వీరాస్వామి ఉన్నారు.
హోరాహోరీ పోరు
గొల్లలకోడేరు పంచాయతీ ఆరో వార్డు ఎన్నిక హోరాహౌరీగా జరిగింది. బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలవగా శనివారం ఈ ఎన్నికకు పోలింగ్‌ జరిగింది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ జరిగింది. అయితే సంబలదీవి నాగమణికి 168 ఓట్లు, మరో అభ్యర్థి పడమటి రామలక్ష్మికి 126 ఓట్లు, మరో అభ్యర్థి సువ్వాడ మోహినికి మూడు ఓట్లు లభించాయి. నోటాకు ఒకటి, చెల్లని ఓట్లు మూడు పడ్డాయి. దీంతో ప్రత్యార్థులపై సంబల దీవి నాగమణి 42 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. మొత్తం ఆరో వార్డులో 346 ఓటర్లు ఉండగా 300 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల అధికారి శివకృష్ణ నాగమణి గెలుపును ప్రకటించి నియామక పత్రాన్ని అందించారు. భీమవరం రూరల్‌ సిఐ నాగప్రసాద్‌, ఎస్‌ఐ నాలం శ్రీనివాసరావు ఎన్నికలను పర్యవేక్షించారు.