Sep 21,2023 21:01

ఐక్యతతో అభివృద్ధి దిశగా అడుగులు
ప్రజాశక్తి - పాలకోడేరు
గొల్లలకోడేరు పంచాయతీలో గ్రూపుల పోరుకు ఎట్టకేలకు పుల్‌స్టాప్‌ పడింది. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన పాలకవర్గ సభ్యులు ఆ విధంగా అడుగులు ముందుకు వేసేందుకు గురువారం తొలి అడుగు వేశారు. పంచాయతీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రూపుల మధ్య పోరు జరుగుతోంది. వార్డు మెంబర్లు రెండు గ్రూపులుగా చీలిపోవడంతో గ్రామాభివృద్ధికి అనేక ఆటంకాలు ఏర్పడడంతో గ్రామాభివృద్ధి మందగించింది. పంచాయతీ సమావేశాల్లో అభివృద్ధి పనులకు తీర్మానం చేయాలన్నా, ముందుకు సాగే పరిస్థితి ఉండేది కాదు. దీంతో అధికారులకు గ్రూపుల పోరు తలనొప్పిగా పరిణమించింది. అయితే ఇటీవల ఒక వార్డుకు ఉప ఎన్నిక జరిగిన నేపథ్యంలో ఒక గ్రూపు అభ్యర్థి విజయం సాధించడంతో పరిస్థితులు చక్కబడ్డాయి. మొత్తం 12 మంది వార్డు సభ్యులుండగా ఏడుగురు వార్డు సభ్యులు ఒక గ్రూపులో ఉన్నా, అయిదుగురు సభ్యులు మారో గ్రూపులో ఉన్నారు. ఇదిలా ఉండగా గురువారం పంచాయతీ పాలకవర్గ సమావేశం జరిగింది. ఒక వర్గానికి చెందిన ముగ్గురు సభ్యులు పంచాయతీ సమావేశానికి గైర్హాజరు కాగా మిగిలిన ఇద్దరు సభ్యులు హాజరయ్యారు. అయితే మరొక వర్గానికి చెందిన ఏడుగురు వార్డు సభ్యులకు మెజార్టీ ఉండడంతో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించి, ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఎట్టకేలకు పంచాయతీ పాలకవర్గ సమావేశం ప్రశాంతంగా జరగడంతో పంచాయతీ అధికారులతో పాటు మిగిలిన అధికారులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పంచాయతీ పాలకవర్గం వర్గ పోరు రానున్న రోజుల్లో ఏవిధంగా దారి తీస్తుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మెజార్టీ పాలకవర్గ సభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం.