Jan 20,2023 23:51

మాట్లాడుతున్న సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి కిరణ్‌

ప్రజాశక్తి - ఎటపాక
మండలంలోని గొల్లగుప్ప రెవెన్యూ గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ డిమాండ్‌ చేశారు. గ్రామంలో రేషన్‌, ఉపాధి హామీ కార్డులు మంజూరు చేయాలని, అంగన్వాడీ బిల్డింగ్‌ నిర్మాణం చేయాలని, బండిరేవు నుండి గొల్లగుప్ప వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. శుక్రవారం గొల్లగుప్ప గ్రామంలో పద్దం లక్కీ అధ్యక్షతన జరిగిన గ్రామ జనరల్‌ బాడీ సమావేశంలో కిరణ్‌ మాట్లాడుతూ గొల్లగుప్ప గ్రామం రెవెన్యూ రికార్డుల్లో రెవెన్యూ గ్రామంగా ఉన్నప్పటీ గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. గ్రామంలో కనీసం రేషన్‌, ఉపాధి హామీ కార్డులు కూడా మంజూరు చేయడం లేదన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం గొల్లగుప్ప గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి ఐవి (వెంకటేశ్వర్లు), గిరిజన సంఘం మండల కార్యదర్శి ఇర్ప అజరు, సొందె రామారావు, పెనుబల్లి వెంకన్నబాబు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.