ప్రజాశక్తి- పరవాడ
మండలంలోని రావాడ పంచాయతీ పరిధి గొల్లగుంట గ్రామం ముస్లిం మైనారిటీలకు చెందిన స్మశానవాటికకు రక్షణ కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్వీకుల కాలం నుండి స్మశానవాటికకు ఉపయోగిస్తున్న స్థలాన్ని కబ్జా చేసి, తమ సొంత స్థలంలో కలుపుకోవడానికి దౌర్జన్యం పూర్వకంగా దాని చుట్టూ ఉన్న పెన్సింగ్ పోల్స్‌ని రాత్రి సమయంలో విరగొట్టారని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని, మైనార్టీలకు రక్షణ కల్పించాలని కోరారు. గొల్లగుంట ముస్లిం స్మశానవాటికను రెవిన్యూ అధికారులు పక్కనే ఉన్న గెడ్డ వాగులో చూపించే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవంగా ఎవరైనా మరణిస్తే ముస్లిం సంప్రదాయం ప్రకారం ఖననం చేసి సమాధులు నిర్మించుకుంటారని, అలాంటిది నీరు ప్రవహించే గెడ్డ వాగుల్లో ఎలా ఖననం చేసి సమాధులు నిర్మిస్తారని ప్రశ్నించారు. రెవిన్యూ అధికారులు కబ్జా చేసేవారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే అలాంటి అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. మైనార్టీల స్మశానవాటికను రక్షణ కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గనిశెట్టి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు షేక్ ఆలీ, గ్రామ పెద్దలు అబ్దుల్ జలీల్, షేక్ యాసీన్, మదీనా, జాకీర్ హుస్సేన్, మహమ్మద్ రఫీ, అజారుద్దీన్, షేక్ బాషా, గ్రామస్తులు పాల్గొన్నారు.